విజయవాడలో ఏడుగురు టీడీపీ నేతల సస్పెన్షన్.. రెబల్స్‌గా పోటీ చేయడమే కారణం!
విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన ఏడుగురు నేతలపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సస్పెన్షన్ వేటు వేసింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, రెబల్స్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారనే కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు పార్టీ ప్రకటించింది.
సస్పెన్షన్‌కు గురైన వారిలో కాకొల్లు మహేంద్రనాథ్ (బాబీ), దేవరపు మాల్యాద్రి, గెడ్డం శ్రీనివాసరావు, కోట నారాయణ, చంద్రశేఖర్, కొమ్మినేని సురేష్, మాదాల సత్యవతి ఉన్నారు. వీరికి టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని పార్టీ స్పష్టం చేసింది.
విజయవాడ కార్పొరేషన్‌లోని 1వ డివిజన్‌ను టీడీపీ గుడిపాటి సౌజన్యకు కేటాయించింది. ఈ స్థానాన్ని ఆశించిన కొమ్మినేని సురేష్, మాదాల సత్యవతి టికెట్లు దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిచినట్లు సమాచారం.
అలాగే 69వ డివిజన్‌ను కూటమి పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. అక్కడ జనసేన అభ్యర్థిగా అడబాల కృష్ణాజీ బరిలో ఉండగా, టీడీపీ నుంచి టికెట్ ఆశించిన కాకొల్లు మహేంద్రనాథ్ (బాబీ) స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ ఉపసంహరించుకోకుండా పోటీలో కొనసాగినట్లు పార్టీ తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఏడుగురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.
స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు, రెబల్ అభ్యర్థుల పోటీ నేపథ్యంలో విజయవాడ టీడీపీలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
