99TV News

    IND vs SL: Devdutt Padikkal vs Sai Sudharsan for No.3 Spot

    IND vs SL: Devdutt Padikkal vs Sai Sudharsan for No.3 Spot

    IND vs SL: వరుసగా రెండు సెంచరీలతో దేవదత్ ప‌డిక్కల్ సత్తా.. సాయి సుదర్శన్‌కు నంబర్-3 ప్లేస్ కష్టమేనా?

    టీమిండియాలో నంబర్-3 స్థానంపై ఇప్పుడు ఆసక్తికరమైన పోటీ మొదలైంది. కొంతకాలంగా ఈ స్థానంలో సాయి సుదర్శన్ కనిపించగా.. శ్రీలంక సిరీస్‌కు ముందు అతను గాయపడటంతో దేవదత్ పడిక్కల్‌కు అవకాశం వచ్చింది. వచ్చిన ఛాన్స్‌ను పడిక్కల్ మాత్రం మామూలుగా ఉపయోగించుకోలేదు. వరుసగా రెండు టెస్టుల్లో రెండు సెంచరీలు చేసి తన స్థానాన్ని మరింత బలంగా మార్చుకున్నాడు.

    గాలేలో జరిగిన తొలి టెస్టులో పడిక్కల్ తన టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. అక్కడితో ఆగకుండా కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులోనూ మరో శతకం బాదాడు. రెండో టెస్టు తొలి రోజు 117 పరుగులతో అదరగొట్టి భారత ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. దీంతో ఈ సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌ల్లోనే 328 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

    సాయి సుదర్శన్‌కు ఎదురుదెబ్బ?

    సాయి సుదర్శన్ గాయం కారణంగా జట్టుకు దూరమైన సమయంలో పడిక్కల్‌కు వచ్చిన అవకాశం ఇప్పుడు అతనికి పెద్ద ప్లస్‌గా మారింది. సుదర్శన్ తిరిగి ఫిట్‌గా వచ్చిన తర్వాత నంబర్-3 స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం అంత ఈజీ కాదనే చర్చ మొదలైంది.

    మాజీ భారత ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పడిక్కల్ వరుసగా రెండు సెంచరీలు చేయడంతో.. సుదర్శన్ తిరిగి వచ్చిన వెంటనే ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోవడం కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డాడు.

    గణాంకాల్లోనూ పడిక్కల్ ముందంజ

    ఆకాశ్ చోప్రా ప్రస్తావించిన గణాంకాల ప్రకారం.. సాయి సుదర్శన్ ఏడు టెస్టులలో 12 ఇన్నింగ్స్‌లు ఆడి 383 పరుగులు చేశాడు. మరోవైపు పడిక్కల్ కేవలం నాలుగు టెస్టుల్లో ఆరు ఇన్నింగ్స్‌లలోనే 418 పరుగులు సాధించాడు. ప్రస్తుతం పడిక్కల్ ఫామ్ అతనికి అనుకూలంగా ఉంది.

    అంతేకాదు.. పడిక్కల్ టెస్టు క్రికెట్‌తో పాటు ఇతర ఫార్మాట్లలోనూ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడని చోప్రా పేర్కొన్నాడు. టీ20ల్లో దూకుడుగా ఆడగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ.. టెస్టు క్రికెట్‌కు అవసరమైన ఓపిక, పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేసే నైపుణ్యాన్ని కూడా అతను చూపిస్తున్నాడని ప్రశంసించాడు.

    నంబర్-3పై టీమిండియాకు కొత్త ఆప్షన్

    రాహుల్ ద్రవిడ్, చటేశ్వర్ పుజారా తర్వాత భారత టెస్టు జట్టులో నంబర్-3 స్థానానికి సరైన ఆటగాడి కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇప్పుడు పడిక్కల్ వరుస సెంచరీలతో ఆ స్థానానికి బలమైన అభ్యర్థిగా మారాడు.

    అయితే సాయి సుదర్శన్‌ను పూర్తిగా పక్కన పెట్టినట్టుగా ఇప్పుడే చెప్పలేం. అతనికి కూడా అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు లభించాయి. కానీ పడిక్కల్ ప్రస్తుత ఫామ్ మాత్రం సెలెక్టర్లకు మరో ఆలోచనను తీసుకొచ్చేలా చేస్తోంది.

    శ్రీలంక సిరీస్ ముగిసేలోపు పడిక్కల్ తన ఫామ్‌ను ఇలాగే కొనసాగిస్తే.. నంబర్-3 స్థానంపై అతని క్లెయిమ్ మరింత బలపడే అవకాశం ఉంది. మరోవైపు గాయం నుంచి తిరిగి వచ్చే సాయి సుదర్శన్.. ఈ పోటీలో తన స్థానాన్ని తిరిగి ఎలా సంపాదించుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది.