99TV News

    Premier League 2026-27: కొత్త సీజన్‌లో ఆసక్తికరమైన అంశాలు

    Premier League 2026-27: కొత్త సీజన్‌లో ఆసక్తికరమైన అంశాలు

    ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ షురూ.. ఈ విషయాలపైనే అందరి ఫోకస్!

    ఫుట్‌బాల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ వచ్చేసింది. కొత్త సీజన్ మొదలవుతున్న వేళ టైటిల్ రేసు కంటే ముందే కొన్ని ఆసక్తికరమైన కథలు ఫోకస్‌లోకి వచ్చాయి. కొత్త ఆటగాళ్లు తమను తాము నిరూపించుకోవాల్సి ఉండగా.. కొందరు మేనేజర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మరికొందరు ఆటగాళ్లు తమ మాజీ క్లబ్‌లకే ఎదురుగా బరిలోకి దిగబోతున్నారు.

    ఆర్సెనల్ యువ ఆటగాడు ఈథన్ న్వానెరి భవిష్యత్తు కూడా ఆసక్తికరంగా మారింది. 2024-25లో తన ప్రతిభతో ఆకట్టుకున్న అతడు గత సీజన్‌లో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేదు. మార్సెయిల్‌కు లోన్‌పై వెళ్లినా ఆశించినంతగా రాణించలేకపోయాడు. దీంతో రెగ్యులర్ ఫుట్‌బాల్ కోసం మరో లోన్‌కు పంపే అవకాశాలను ఆర్సెనల్ పరిశీలిస్తోంది. మిలాన్, ఆర్‌బీ లైప్‌జిగ్, డార్ట్మండ్, ఫుల్హామ్ అతడిపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అందుకే కోవెంట్రీతో సీజన్ ఓపెనర్‌లో అతడు బెంచ్‌లో కనిపించడం కూడా అనుమానంగానే ఉంది.

    మాంచెస్టర్ యునైటెడ్‌లో మాత్రం కొత్త మిడ్‌ఫీల్డ్ కాంబినేషన్‌పై ఆసక్తి నెలకొంది. ఈ వేసవిలో క్లబ్ సెంట్రల్ మిడ్‌ఫీల్డ్‌ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. ఆండ్రే సాంటోస్, యువోరి టైలెమాన్స్ ప్రీ-సీజన్‌లో ఎక్కువ సమయం జట్టుతో ఉన్నారు. కొబ్బీ మైనూ మాత్రం ఆలస్యంగా జట్టులో చేరాడు. దీంతో హల్ సిటీతో తొలి మ్యాచ్‌లో మైఖేల్ క్యారిక్ ఎలాంటి కాంబినేషన్‌ను ఎంచుకుంటాడన్నది ఆసక్తికరం. సాంటోస్, టైలెమాన్స్ కలిసి ఆడితే యునైటెడ్ మిడ్‌ఫీల్డ్‌కు కావాల్సిన డిఫెన్సివ్ బ్యాలెన్స్‌తో పాటు బంతిని ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం కూడా రావచ్చనే అంచనాలు ఉన్నాయి.

    ఎవర్టన్, క్రిస్టల్ ప్యాలెస్ మధ్య జరిగిన ట్రాన్స్‌ఫర్ స్వాప్ కూడా ఈ సీజన్ ప్రారంభంలో ప్రత్యేకమైన కథగా మారింది. డ్వైట్ మెక్‌నీల్, బ్రెన్నన్ జాన్సన్ క్లబ్‌లు మార్చుకున్నారు. ఇప్పుడు వీరిద్దరూ తొలి వారాంతంలోనే తమ మాజీ క్లబ్‌లకు ఎదురుగా ఆడబోతున్నారు. కొత్త జట్లలో తమ విలువను నిరూపించుకోవడానికి ఇద్దరికీ ఇది మంచి అవకాశం.

    ప్రమోషన్ సాధించి ప్రీమియర్ లీగ్‌లోకి వచ్చిన ఇప్స్‌విచ్ కూడా భారీగా ఆటగాళ్లను కొనుగోలు చేసింది. గతంలో సన్‌డెర్లాండ్ కొత్త ఆటగాళ్లను త్వరగా ఒక యూనిట్‌గా మార్చుకుని విజయవంతమైన ఆరంభం చేసిన విషయం తెలిసిందే. ఇప్స్‌విచ్ కూడా అదే ఫార్ములాను అనుసరించే ప్రయత్నం చేస్తోంది. కొత్త కోచ్ గ్యారీ ఓ'నీల్ వద్ద ఇప్పటికే 12 మంది కొత్త సైనింగ్స్ ఉన్నారు. అందులో టౌలూస్ నుంచి వచ్చిన బ్రెజిలియన్ స్ట్రైకర్ ఎమెర్సన్‌పై ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి. అతడు ప్రీమియర్ లీగ్‌కు ఎంత త్వరగా అలవాటు పడతాడనేదే ఇప్స్‌విచ్ సీజన్‌కు కీలకం కానుంది.

    నాటింగ్‌హామ్ ఫారెస్ట్‌లో ఒస్మానే డియోమాండేపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. స్పోర్టింగ్ నుంచి సుమారు £34 మిలియన్లకు వచ్చిన ఈ ఐవరీ కోస్ట్ సెంటర్-బ్యాక్‌ను కోచ్ ఒలివర్ గ్లాస్నర్ ఎంతోకాలంగా కోరుకున్నాడు. లీడ్స్‌తో మ్యాచ్‌లో అతడు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. వేగం, శారీరక బలం మాత్రమే కాదు.. సెట్‌పీస్‌లలో అతడి హెడింగ్ సామర్థ్యం కూడా ఫారెస్ట్‌కు అదనపు బలం కావచ్చు.

    టోటెన్‌హామ్‌లో మార్కోస్ సెనెసి రాక కూడా కీలకంగా మారింది. క్రిస్టియన్ రొమేరో అట్లెటికో మాడ్రిడ్‌కు వెళ్లిపోవడంతో డిఫెన్స్‌లో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయాల్సిన బాధ్యత సెనెసిపై ఉంది. బోర్న్‌మౌత్‌లో ఆడిన సమయంలో సెనెసి పెద్దగా వార్తల్లో కనిపించకపోయినా.. ప్రశాంతంగా, స్థిరంగా డిఫెన్స్ చేయడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా మూడు ప్రీమియర్ లీగ్ సీజన్లు ఆడినా ఇప్పటివరకు ఒక్కసారి కూడా రెడ్ కార్డ్ చూడలేదు. టోటెన్‌హామ్‌కు ప్రస్తుతం కావాల్సిన స్థిరత్వాన్ని సెనెసి అందిస్తాడా అన్నది చూడాలి.

    ఆస్టన్ విల్లా మాత్రం సీజన్ మొదలవకముందే సమస్యలతో సతమతమవుతోంది. ఉనై ఎమెరీకి మిడ్‌ఫీల్డ్‌లో జోవో గోమ్స్, జోహాన్ మంజాంబి ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉన్నాయి. అమడూ ఒనానా దీర్ఘకాలంగా అందుబాటులో లేడు. మరోవైపు యువోరి టైలెమాన్స్ క్లబ్‌ను వీడాడు. ఎజ్రీ కొంసా కూడా ఆర్సెనల్‌కు వెళ్లే అవకాశం ఉంది. మోర్గాన్ రోజర్స్, లూకాస్ డిగ్నే ఇప్పటికే వెళ్లిపోయారు. గోల్‌కీపర్ ఎమి మార్టినెజ్ భవిష్యత్తు, ఒల్లీ వాట్కిన్స్‌పై అల్-హిలాల్ ఆసక్తి వంటి అంశాలు కూడా ఎమెరీకి తలనొప్పిగా మారాయి. బ్రైటన్‌తో తొలి మ్యాచ్‌లో అతడు ఎలాంటి జట్టును ఎంచుకుంటాడన్నది ఆసక్తికరం.

    మాంచెస్టర్ సిటీ విషయానికి వస్తే ఎంజో మారెస్కాపై ఒత్తిడి ఇప్పటికే మొదలైంది. కమ్యూనిటీ షీల్డ్‌లో ఆర్సెనల్ చేతిలో సిటీ 3–0తో ఓడిపోవడం జట్టుపై ప్రశ్నలు పెంచింది. అంతేకాదు, రోడ్రి బార్సిలోనాకు వెళ్లడం సిటీకి పెద్ద దెబ్బగా మారింది. ఇప్పుడు బోర్న్‌మౌత్‌తో జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో సిటీ విజయం సాధించడం మారెస్కాకు చాలా కీలకం. సొంత మైదానంలో మరోసారి తడబడితే కొత్త మేనేజర్‌పై విమర్శలు మరింత పెరిగే అవకాశం ఉంది.

    ఇక న్యూకాజిల్-లివర్‌పూల్ మ్యాచ్‌పై అందరి చూపు పడటానికి ప్రధాన కారణం అలెగ్జాండర్ ఇసాక్. గత వేసవిలో న్యూకాజిల్ నుంచి లివర్‌పూల్‌కు £125 మిలియన్ల భారీ డీల్‌తో వెళ్లిన ఇసాక్ తొలిసారి సెయింట్ జేమ్స్ పార్క్‌కు తిరిగి వస్తున్నాడు. అతడి ట్రాన్స్‌ఫర్ అప్పట్లో న్యూకాజిల్ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఇప్పుడు అదే అభిమానుల ముందు ఇసాక్ ఎలా స్పందిస్తాడన్నది మ్యాచ్‌లో పెద్ద చర్చగా మారనుంది. ఇదే సమయంలో న్యూకాజిల్ కొత్త మేనేజర్ మథియాస్ జైస్లే, లివర్‌పూల్ కొత్త కోచ్ ఆండోని ఇరావోలా కూడా తమ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కెవిన్ కీగన్‌కు నివాళి కార్యక్రమం కూడా ఉండనుంది.

    సీజన్ తొలి వారాంతంలో ఫుల్హామ్-చెల్సియా మ్యాచ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. గత సీజన్‌లో రియల్ మాడ్రిడ్‌కు కోచ్‌లుగా ఉన్న జాబి అలోన్సో, అల్వారో అర్బెలోవా ఇప్పుడు ప్రీమియర్ లీగ్‌లో కొత్త పాత్రల్లో కనిపించబోతున్నారు. అలోన్సో చెల్సియా బాధ్యతలు చేపట్టగా, అర్బెలోవాతో కలిసి పనిచేసిన గొంజాలో గార్సియా, సీజర్ పలాసియోస్ కూడా ఫుల్హామ్ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. అందుకే వీరికి ఈ సీజన్ ఆరంభం నుంచే తమ నిర్ణయాలు సరైనవేనని నిరూపించాల్సిన అవసరం ఉంది.

    మొత్తంగా చూస్తే.. ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ తొలి వారాంతంలోనే ఫుట్‌బాల్ అభిమానులకు ఆసక్తికరమైన కథలు చాలానే ఉన్నాయి. కొత్త జట్లు ఎలా సెటిల్ అవుతాయి? కొత్త మేనేజర్లు ఎలా ఆరంభిస్తారు? భారీ ట్రాన్స్‌ఫర్ల తర్వాత ఆటగాళ్లు ఎలా స్పందిస్తారు? మాజీ క్లబ్‌లకు తిరిగి వచ్చే స్టార్లకు ఎలాంటి స్వాగతం లభిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు సీజన్ తొలి మ్యాచ్‌లతోనే మొదలుకానున్నాయి.