శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ప్లేయింగ్ XIలో లేకపోయినా తనదైన స్టైల్లో మ్యాచ్‌పై ప్రభావం చూపించాడు.
గాయపడిన రిషభ్ పంత్ స్థానంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చిన సర్ఫరాజ్.. షార్ట్ లెగ్, సిల్లీ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తూ శ్రీలంక బ్యాటర్లను తన మాటలతో ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వాతో జరిగిన సరదా స్లెడ్జింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటన ధనంజయ డి సిల్వా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జరిగింది. భారత స్పిన్నర్ మానవ్ సుతార్ బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతుండగా, బౌలర్ చేతి నుంచి బంతి విడుదల కావడానికి ముందు ధనంజయ క్రీజు నుంచి పక్కకు తప్పుకున్నాడు. సైట్స్క్రీన్ వెనుక ఏదో కదలిక తన దృష్టిని మరల్చుతోందని అతడు సూచించాడు.
అక్కడే షార్ట్ లెగ్‌లో ఉన్న సర్ఫరాజ్‌కు అవకాశం దొరికింది. ధనంజయను చూస్తూ వెనుక ఏమీ లేదని, అటూ ఇటూ చూడకుండా ముందుకు చూసి ఆడాలని సరదాగా కవ్వించాడు. అంతేకాదు, సమయం వృథా చేస్తున్నావంటూ శ్రీలంక కెప్టెన్‌పై కామెంట్ చేశాడు.
“అక్కడ ఏమీ లేదు భాయ్.. భయపడకు, ఆడు!” అంటూ సర్ఫరాజ్ చేసిన వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. కెప్టెన్‌గా ఉన్న నువ్వే ఇలా భయపడితే ఎలా అన్నట్లుగా అతడు ధనంజయను మరింత కవ్వించాడు. సర్ఫరాజ్ మాటలు విన్న ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు కూడా నవ్వుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కూడా సర్ఫరాజ్ స్టైల్‌ను ఆసక్తిగా చర్చిస్తున్నారు.
ఆ తర్వాత జరిగిన పరిణామం మరింత ఆసక్తికరంగా మారింది. సర్ఫరాజ్‌తో ఈ మాటల యుద్ధం జరిగిన కొన్ని బంతులకే ధనంజయ డి సిల్వాను మానవ్ సుతార్ ఔట్ చేశాడు. 35వ ఓవర్ ఐదో బంతికి డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించిన ధనంజయ బ్యాట్‌కు ఎడ్జ్ తగలడంతో అతడి ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో సర్ఫరాజ్ మాటలతో సృష్టించిన ఒత్తిడి కూడా వికెట్లో పాత్ర పోషించిందా అంటూ సోషల్ మీడియాలో అభిమానులు సరదాగా కామెంట్లు చేశారు.
సర్ఫరాజ్‌కు ఈ సిరీస్‌లో ప్లేయింగ్ XIలో అవకాశం దక్కలేదు. సాయి సుదర్శన్ స్థానంలో చివరి సమయంలో అతడిని భారత జట్టులోకి తీసుకున్నారు. రెండో టెస్టులో కూడా తుది జట్టులో చోటు దక్కకపోయినా, రిషభ్ పంత్ గాయపడటంతో సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్ చేసే అవకాశం వచ్చింది.
ఆ అవకాశాన్ని సర్ఫరాజ్ తనదైన స్టైల్లో ఉపయోగించుకున్నాడు. బ్యాటింగ్ చేసే ఛాన్స్ లేకపోయినా షార్ట్ లెగ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లకు దగ్గరగా ఉంటూ నిరంతరం మాట్లాడటం, ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించడం ద్వారా మ్యాచ్‌లో తన ఉనికిని చాటుకున్నాడు.
మొత్తానికి ప్లేయింగ్ XIలో లేకపోయినా సర్ఫరాజ్ ఖాన్ ఈ టెస్టులో వైరల్ మూమెంట్‌ను సొంతం చేసుకున్నాడు. ధనంజయ క్రీజు నుంచి తప్పుకోవడం, వెంటనే సర్ఫరాజ్ అతడిని కవ్వించడం, ఆ తర్వాత కొన్ని బంతులకే ధనంజయ వికెట్ పడటం.. ఈ మొత్తం సీక్వెన్స్ అభిమానులను ఆకట్టుకుంది.
