కరీంనగర్ వేదికగా సిద్ధాంతాల సమరం..జాతీయత వర్సెస్ ప్రాంతీయత.
ఉద్యమాల పురిటి గడ్డ కరీంనగర్ లో రాజకీయ సమీకరణాలు కొత్తగా పురుడుపోసుకుంటున్నాయి...ప్రస్తుత రాజకీయం సభలు, జనసమీకరణలకే పరిమితం కాలేదు. ఇది రెండు బలమైన సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరుగా మారింది. ఒకవైపు బీజేపీ జాతీయత అనే నినాదంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ దూసుకెళ్తుంటే.. మరోవైపు ప్రాంతీయత, తెలంగాణ ఆత్మగౌరవం అనే అస్త్రంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బరిలోకి దిగుతున్నారు. వారం రోజుల వ్యవధిలో కరీంనగర్ గడ్డపై జరిగిన బీజేపీ మహా పాదయాత్ర, జరగబోతున్న బీఆర్ఎస్ దీక్షా దివస్ సభలు.. ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ఇంతకీ బండి సంజయ్ నేషనలిజం మంత్రం పనిచేస్తుందా? లేక కేటీఆర్ తెలంగాణ సెంటిమెంట్ మరోసారి ప్రజలను ఆకట్టుకుంటుందా? కరీంనగర్ అడ్డాగా సాగుతున్న ఈ పొలిటికల్ వార్ వెనుక అసలు వ్యూహమేంటో ఈ స్టోరీలో చూద్దాం...
జాతీయస్థాయిలో జరుగుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సర్ ప్రక్రియపై బీజేపీ ఢిల్లీ నుండి గల్లి బాట పట్టింది... కాషాయ దళపతి బండి సంజయ్ నేతృత్వంలో
కరీంనగర్ వేదికగా లక్ష మందితో చేపట్టిన మహా పాదయాత్ర పేరుతో తో బిజెపి బల ప్రదర్శన చేసింది.
నవంబర్ 23న కరీంనగర్ వేదికగా జరిగిన మహా పాదయాత్రతో కేంద్ర మంత్రి బండి సంజయ్ తన రాజకీయ పంథాను మరోసారి స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ సమక్షంలో సాగిన ఈ యాత్రలో బండి సంజయ్ పూర్తిగా జాతీయత అంశాన్ని తెరపైకి తెచ్చారు. సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న విపక్షాల తీరును ఎండగడుతూ, రాజ్యాంగ సంస్థల పరిరక్షణ, దేశ భద్రత, తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఆవశ్యకతను ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, జాతీయ పార్టీ అయిన బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్న వాదనను బండి బలంగా వినిపించారు. తద్వారా కరీంనగర్ నుండి తెలంగాణ వ్యాప్తంగా కాషాయ జెండా ఎగురవేసేందుకు జాతీయవాదమే తమ ప్రధాన ఆయుధమని బండి సంజయ్ సంకేతాలిచ్చారు...కార్యకర్తల ఒంట్లో కాషాయ రక్తం ప్రవహిస్తుందని, గుండె జైశ్రీరామ్ అని కొట్టుకుంటుందని బండి సంజయ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
Also Read- నియోజకవర్గాల పునర్విభజన బిల్లు: ఉభయ సభల్లో నంబర్స్ గేమ్.. ఏ పార్టీ ఎటువైపు?
తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన కరీంనగర్లో.. గులాబీ దళం బీఆర్ఎస్ పార్టీ తన పూర్వవైభవాన్ని చాటుకునేందుకు భారీ బలప్రదర్శనకు సిద్ధమైంది. నవంబర్ 29 దీక్షా దివస్ వేదికగా కరీంనగర్‌లోని అలుగునూర్‌లో భారీ బహిరంగ సభకు గులాబీ దళం కసరత్తు చేస్తోంది. 2009లో ఇదే అలుగునూర్ చౌరస్తా వద్ద కేసీఆర్ అరెస్టుతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన నేపథ్యంలో.. ఆమరణ దీక్షకు పూనుకున్న అదే చారిత్రాత్మక గడ్డ నుంచే మరోసారి తెలంగాణ ఆత్మగౌరవం, ఉద్యమ ఆకాంక్ష నినాదాన్ని కేటీఆర్ వినిపించబోతున్నారు. జాతీయ పార్టీల చేతిలో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెట్టుబడులు తరలిపోతున్నాయని విమర్శిస్తున్న కేటీఆర్.. కరీంనగర్ సభ ద్వారా ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని చాటిచెప్పేందుకు వ్యూహరచన చేశారు.
మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ సభకు సుమారు 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో లక్ష మందితో కరీంనగర్ గడ్డపై గులాబీ సత్తా చాటేలా స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నీ తానై ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు... పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి,మాజీ ఎంపీ వినోద్ కుమార్, పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కల్వకుంట్ల, సతీష్ బాబు, సుంకె రవిశంకర్,రసమయి బాలకిషన్ జిల్లా అధ్యక్షుడు జీ వీ రామకృష్ణారావు సహా ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలంతా కలిసి కరీంనగర్ నగరాన్ని ఫ్లెక్సీలు, కటౌట్లతో గులాబీమయంగా మార్చేశారు. ఈ వేదికపై తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులను ఘనంగా సన్మానించడంతో పాటు.. ఉద్యమ సెంటిమెంట్‌ను మరోసారి రగిలించి క్యాడర్లో కొత్త జోష్ నింపేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది.
మొత్తం మీద కరీంనగర్ నగరం వేదికగా ఒకవైపు జాతీయ స్థాయి అంశాలతో బీజేపీ, మరోవైపు ప్రాంతీయ సెంటిమెంట్‌తో బీఆర్ఎస్ పోటాపోటీగా సభలు నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా మారిందని స్థానిక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చారిత్రకంగా తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువుగా ఉండటంతో పాటు, ఇటీవలి ఎన్నికల్లో జాతీయ పార్టీల వైపు కూడా మొగ్గు చూపిన నేపథ్యం ఉందని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో జాతీయత నినాదంతో సాగిన బీజేపీ పాదయాత్రకు, ప్రాంతీయత నినాదంతో జరిగే బీఆర్ఎస్ దీక్షా దివస్‌కు పొలిటికల్ మైలేజ్ ఎంత, ఎవరికి అన్నది రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ.
