99TV News

    అచ్చంపేట సీఎం సభ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

    అచ్చంపేటలో సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

    అచ్చంపేటలో సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

    భద్రత, పార్కింగ్, హెలిప్యాడ్, పాదయాత్ర మార్గం, అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాట్లపై అధికారులకు సూచనలు

    అచ్చంపేట పట్టణంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, సబ్ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి ఆయన సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పాదయాత్ర మార్గం, అంబేద్కర్ కూడలి ప్రాంతాలను సందర్శించారు.

    పట్టణంలోని వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేయనున్న బహిరంగ సభా ప్రాంగణంలో వేదిక, ప్రజలు కూర్చునే స్థలం, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్ అంశాలను కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. భద్రతా చర్యలకు ప్రాధాన్యత ఇచ్చి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీకి సూచనలు చేశారు. వీఐపీ వాహనాలు, ప్రజల వాహనాలకు వేర్వేరు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా మార్గదర్శక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

    HIGHLIGHTS

    - వై జంక్షన్ వద్ద సీఎం బహిరంగ సభ

    - ఆర్టీసీ గ్రౌండ్‌లో హెలిప్యాడ్ పరిశీలన

    - అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళి ఏర్పాట్లు

    - భద్రత, పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి

    లింగాల రోడ్డులోని ఆర్టీసీ గ్రౌండ్‌లో హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ స్థలాన్ని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. హెలిప్యాడ్ సిద్ధం, భద్రత, పరిసరాల పర్యవేక్షణపై అధికారులకు సూచనలు చేశారు. అక్కడి నుంచి సభా ప్రాంగణం వరకు ముఖ్యమంత్రి పాదయాత్రగా వెళ్లే మార్గాన్ని కూడా పరిశీలించి, ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

    అంబేద్కర్ కూడలిలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి నివాళులర్పించే ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత, భద్రత, రాకపోకల నిర్వహణపై చర్చించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ దేవ సహాయం, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.