తెలంగాణ ఉద్యమ చరిత్రను భావితరాలకు తెలియజేయడం మన బాధ్యత – దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలి
తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చారిత్రాత్మక ఘట్టమని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దాన భంగాలు, కేసీఆర్ నాయకత్వంలో సాగిన ఉద్యమం, ప్రజల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని *మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్,మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్* అన్నారు.
రేపు నవంబర్ 29న కరీంనగర్ నగరంలోని అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ భారీ బహిరంగ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా ప్రజలు, యువత తరలిరానున్నారని, సభను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపారు.
2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటైనప్పటి నుంచి కేసీఆర్ తెలంగాణ అంతటా వందలాది బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంత ప్రజల నీళ్లు, నిధులు, నియామకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రజలకు వివరించారని తెలిపారు. 2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీతో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.
2006లో కేసీఆర్ రాజీనామా చేసి కరీంనగర్ ఉప ఎన్నికకు వెళ్లినప్పుడు ప్రజలు ఆయనకు ఘన విజయం అందించి తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ మద్దతును చాటారని గుర్తు చేశారు. అనంతరం ప్రణబ్ ముఖర్జీ కమిటీ, వివిధ రాజకీయ పార్టీల సంప్రదింపులు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా వచ్చిన మద్దతు లేఖలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేసిందని అన్నారు.
2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచిందని తెలిపారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణ అంతటా విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు ఉద్యమంలోకి వచ్చారని, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల పోరాటం, ప్రజల ఆందోళనలు, ఉద్యమ తీవ్రతతో కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిందని పేర్కొన్నారు. అయితే డిసెంబర్ 23న కాంగ్రెస్ పార్టీ మరోసారి వెనక్కి తగ్గి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఒక్కరి వల్లనో, ఒక రాజకీయ ప్రకటన వల్లనో సాధ్యపడలేదని, దశాబ్దాల పోరాటం, వేలాది మంది ఉద్యమకారుల త్యాగాలు, విద్యార్థుల ఆందోళనలు, ప్రజల భాగస్వామ్యం, కేసీఆర్ నాయకత్వంలో సాగిన నిరంతర ఉద్యమం ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు.
నేటి యువతలో చాలా మంది తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత పుట్టిన వారని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, కాంగ్రెస్ చేసిన వాగ్దాన భంగాలు, డిసెంబర్ 9 ప్రకటన, డిసెంబర్ 23న జరిగిన పరిణామాల గురించి వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దీక్షా దివస్ సభలు కేవలం రాజకీయ కార్యక్రమాలు కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్రను భావితరాలకు అందించే వేదికలుగా నిలవాలని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ప్రజలు అప్రమత్తంగా గమనించాలని, రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో ఎవరి పాత్ర ఏమిటో వాస్తవాలను యువతకు తెలియజేయాలని అన్నారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ బహిరంగ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు, యువత, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు సర్దార్ రవీందర్ సింగ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, బండ శ్రీనివాస్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జి.వి. రామకృష్ణారావు, పార్టీ సీనియర్ నాయకులు చల్మెడ లక్ష్మి నర్సింహారావు, హరిశంకర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
