తెలంగాణలో రేపు అమిత్ షా పర్యటన
మెదక్‌లో మిల్క్ ప్లాంట్ పనులు, కరీంనగర్‌లో ప్రతిమ రజతోత్సవంలో కేంద్ర హోంమంత్రి పాల్గొననున్నారు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 4, ఆదివారం తెలంగాణలో ఒక రోజు పర్యటించనున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్‌లో సాబర్ డెయిరీ ప్రొడక్ట్స్ మిల్క్ ప్లాంట్ పనులు ప్రారంభించి, కరీంనగర్‌లో ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రజతోత్సవ వేడుకలకు హాజరుకానున్నారు.
అధికార వర్గాల సమాచారం ప్రకారం, అమిత్ షా శనివారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని లోక్‌భవన్‌లో బస చేస్తారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా తూప్రాన్‌కు వెళ్తారు. ఊర్జా ఇండస్ట్రియల్ పార్క్‌లో ఏర్పాటు కానున్న సాబర్ డెయిరీ ప్రొడక్ట్స్ మిల్క్ ప్లాంట్‌కు సంబంధించిన పనులను ఆయన ప్రారంభిస్తారు.
తూప్రాన్ కార్యక్రమం అనంతరం అమిత్ షా కరీంనగర్‌కు బయలుదేరుతారు. అక్కడ ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రజతోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ పైలాన్‌ను ఆవిష్కరించి, ప్రతిమ డీమ్డ్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం కళాశాల ప్రస్థానాన్ని వివరించే ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించనున్నారు.
HIGHLIGHTS
- అక్టోబర్ 4న తెలంగాణలో అమిత్ షా ఒక రోజు పర్యటన
- ఉదయం 11 గంటలకు తూప్రాన్‌కు హెలికాప్టర్‌లో ప్రయాణం
- సాబర్ డెయిరీ మిల్క్ ప్లాంట్ పనుల ప్రారంభం
- కరీంనగర్‌లో ప్రతిమ సిల్వర్ జూబ్లీ వేడుకలు
కరీంనగర్‌లో ప్రతిమ మెడికల్ కాలేజీ విద్యార్థులతో అమిత్ షా ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు. విద్యార్థులతో జరిగే ఈ సమావేశం పర్యటనలో ముఖ్య కార్యక్రమంగా ఉండనుంది. అయితే ఈ పర్యటనలో బీజేపీ తరఫున ఎలాంటి బహిరంగ సభ నిర్వహించడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.
సాయంత్రం కరీంనగర్‌లో కార్యక్రమాలు ముగిసిన తరువాత అమిత్ షా హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరేలా పర్యటన షెడ్యూల్ రూపొందించారు. ఆయన పర్యటన నేపథ్యంలో హైదరాబాద్, మెదక్, కరీంనగర్ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై అధికారులు సమీక్ష చేపట్టారు.
