పెండింగ్ బిల్లులపై ఎమ్మెల్యే అసంతృప్తి
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సొంత ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో పూర్తయిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందని విమర్శించారు. మంత్రుల నియోజకవర్గాలకే నిధులు ఇస్తారా? ఇతర ప్రాంతాల అభివృద్ధి సంగతేంటని ప్రశ్నించారు.
30 వేల మందితో దీక్షకు హెచ్చరిక
ఇటీవల ఓ కాంట్రాక్టర్ మరణించిన తర్వాత ఆయనకు సంబంధించిన రూ.5 కోట్ల బిల్లు మంజూరైన విషయాన్ని ప్రస్తావిస్తూ అనిరుధ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జడ్చర్లలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి బిల్లుల కోసం తాను కూడా ప్రాణాలు కోల్పోవాలా అంటూ ప్రశ్నించారు.
ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే 30 వేల మందితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. జడ్చర్లకు సాగునీరు అందించే అంశంపైనా పార్టీలకు అతీతంగా పోరాడతానని తెలిపారు. సొంత పార్టీ ఎమ్మెల్యేనే ప్రభుత్వాన్ని బహిరంగంగా ప్రశ్నించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.
