క్షణికానందం కోసం ప్రాణాలు కోల్పోవద్దు: సీపీ సజ్జనర్ విజ్ఞప్తి
ట్యాంక్‌బండ్ సహా బహిరంగ ప్రదేశాల్లో అర్ధరాత్రి పుట్టినరోజు వేడుకలు చేయొద్దని హైదరాబాద్ సీపీ సూచన
నగరంలోని ట్యాంక్‌బండ్, ప్రధాన రహదారులు, చెరువులు, పార్కుల వద్ద అర్ధరాత్రి పుట్టినరోజు వేడుకలు, కేక్ కటింగ్‌లు నిర్వహించొద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ శుక్రవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గుర్తుచేస్తూ ఆయన వీడియో విడుదల చేశారు.
“పుట్టినరోజు కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వేడుక. దానిని ఇళ్ల వద్ద, ఏదైనా సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే జరుపుకోవాలి” అని హైదరాబాద్ సీపీ సజ్జనర్ వీడియో సందేశంలో అన్నారు. అర్ధరాత్రి రోడ్లపై జనసంచారం తక్కువగా ఉండటంతో వాహనాలు అధిక వేగంతో వెళ్తాయని ఆయన పేర్కొన్నారు. “చిన్నపిల్లలను తీసుకుని నడిరోడ్డుపైకి రావడం ఏమాత్రం సరికాదు” అని చెప్పారు.
HIGHLIGHTS
- ట్యాంక్‌బండ్‌పై అర్ధరాత్రి వేడుకలు నిషేధం
- ఇటీవల ప్రమాదంలో చిన్నారి సహా 2 మంది మృతి
- జీహెచ్‌ఎంసీ గతంలోనే ఆదేశాలు జారీ
- పోలీసులకు సహకరించాలని సీపీ విజ్ఞప్తి
“ట్యాంక్‌బండ్‌పై ఇలాంటి వేడుకలు నిర్వహించడం నిబంధనల ప్రకారం పూర్తిగా నిషేధం” అని సజ్జనర్ తెలిపారు. గతంలో జీహెచ్‌ఎంసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. “క్షణికానందం కోసం చేసే పొరపాట్లతో అమూల్యమైన ప్రాణాలను పోగొట్టుకోవద్దు” అని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ఠ ముందస్తు చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ చెప్పారు.
