99TV News

    డీకే అరుణ ఆరోపణలు: Congress BRS చీకటి ఒప్పందం

    కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని డీకే అరుణ ఆరోపణ

    ​కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం.. అందుకే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులపై చర్యల్లేవు

    ​సొంత ఇలాకా మహబూబ్‌నగర్, మల్కాజ్‌గిరి, కామారెడ్డి ఓటములను సీఎం మర్చిపోయారా?

    ​పాలమూరు ప్రాజెక్టును పడావు పెట్టి రైతులకు తీరని అన్యాయం.. అచ్చంపేట సభ వ్యాఖ్యలపై ఎంపీ డీకే అరుణ ఫైర్

    ​

    రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకూ బలపడుతుండటాన్ని చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వణుకు పుడుతోందని, ఆ భయంతోనే దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆమె ఖండిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీని తక్కువ చేసి చూపేందుకు సీఎం విఫలయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

    ​గత ఓటములు మర్చిపోతే ఎలా?

    రేవంత్ రెడ్డి గతాన్ని మరచిపోయి మాట్లాడుతున్నారని డీకే అరుణ ఎద్దేవా చేశారు. "మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ సొంత ఇలాకా అయిన మహబూబ్‌నగర్‌లో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, ప్రజలు బీజేపీనే గెలిపించారు. అంతేకాదు.. మీ సిట్టింగ్ స్థానమైన మల్కాజ్‌గిరిలో బీజేపీని గెలిపించి, గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో మిమ్మల్ని ఓడించింది ఆ సామాన్య కార్యకర్తలే అన్న విషయం మర్చిపోతే ఎలా?" అని నిలదీశారు.

    ​కాంగ్రెస్, బీఆర్ఎస్‌లది చీకటి ఒప్పందం

    Also Read- ఉక్రెయిన్‌ శాంతి చర్చలకు సిద్ధం: పుతిన్

    వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని డీకే అరుణ సంచలన ఆరోపణలు చేశారు. ఆ చీకటి ఒప్పందంలో భాగంగానే కాళేశ్వరం కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు.

    ​హామీల అమలు ఏదీ?.. పాలమూరుకు తీరని ద్రోహం

    ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

    ​మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం ఏమైంది?

    ​2 లక్షల ఉద్యోగాల భర్తీ ఎక్కడికి పోయింది?

    ​ఆడబిడ్డలకు ఇస్తామన్న తులం బంగారం హామీ ఎందుకు అమలు చేయలేదు?

    అని ప్రశ్నల వర్షం కురిపించారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా భూములను పడావు పెట్టి, గతంలో కేసీఆర్ చేసినట్లుగానే పాలమూరు రైతులకు తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ​కాంగ్రెస్‌కూ రాజకీయ సమాధి తప్పదు

    తెలంగాణ ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్‌కు పాడె కట్టారని, రాబోయే రోజుల్లో హామీలను విస్మరించిన కాంగ్రెస్‌ను కూడా రాజకీయంగా బొంద పెట్టడం ఖాయమని డీకే అరుణ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేసినా.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.