99TV News

    మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి హౌస్ అరెస్ట్ | Sabitha Indra Reddy House Arrest

    మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి హౌస్ అరెస్ట్ | Sabitha Indra Reddy House Arrest

    హైదరాబాద్:

    రాజధాని హైదరాబాద్‌లో బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీనగర్ కాలనీలోని ఆమె నివాసంలో సబితా ఇంద్రారెడ్డితో పాటు ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డిలను మధురా నగర్ పోలీసులు బుధవారం వేకువజామున హౌస్ అరెస్ట్ చేశారు.

    ఎలాంటి పిలుపునివ్వకపోయినా నిర్బంధం

    పోలీసుల తీరుపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "మేము ఎలాంటి ధర్నాలు లేదా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వకపోయినా వేకువజామున 4 గంటల నుంచే ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించి గృహ నిర్బంధం చేశారు" అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రజాప్రతినిధులను, నాయకులను ఇలా నిర్బంధించడం దుర్మార్గమని పేర్కొన్నారు.

    ఎమర్జెన్సీ తరహా పాలన!

    రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని, పూర్తిస్థాయిలో ఎమర్జెన్సీ తరహా పాలన నడుస్తోందని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ, ముందస్తు అరెస్టుల పేరుతో భయాందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల పక్షాన పోరాటాన్ని ఆపేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.