గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ చికిత్సతో ముగ్గురు మగ శిశువుల జననం
తొమ్మిదేళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ తల్లీబిడ్డలను క్షేమంగా డిశ్చార్జ్ చేసిన గాంధీ వైద్యులు
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ చికిత్స పొందిన వనపర్తి దంపతులకు ఒకే కాన్పులో ముగ్గురు మగ శిశువులు జన్మించగా, నెలలు నిండకముందే పుట్టిన శిశువులను వైద్యులు ప్రత్యేక సంరక్షణతో కాపాడి తల్లితో పాటు క్షేమంగా డిశ్చార్జ్ చేశారు.
గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ ఉషారాణి శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. వనపర్తికి చెందిన ఈశ్వర్, అవంతి దంపతులకు వివాహమై 9 సంవత్సరాలు గడిచినా సంతానం కలగలేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐయూఐ సహా చికిత్సలు చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో వారు 2026 జనవరిలో గాంధీ ఆసుపత్రి ఐవీఎఫ్ కేంద్రాన్ని ఆశ్రయించారు. అవసరమైన పరీక్షల తర్వాత రెండో సైకిల్లోనే అవంతి గర్భం దాల్చినట్లు వైద్యులు తెలిపారు. స్కానింగ్‌లో ముగ్గురు శిశువులు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో కేసును హైరిస్క్‌గా పర్యవేక్షించారు.
ముగ్గురు శిశువులు ఉండటం, గర్భాశయ ముఖద్వారం చిన్నదిగా ఉండటం వల్ల గర్భస్రావం ప్రమాదం ఉందని గుర్తించిన వైద్యులు 14వ వారంలో మెక్‌డొనాల్డ్స్ సర్వికల్ సర్‌క్లాజ్ విధానంలో గర్భాశయానికి కుట్లు వేశారు. అనంతరం అవంతిని నిరంతరం పర్యవేక్షించారు. 32 వారాలకు, అక్టోబర్ 7న ఉమ్మనీరు బయటకు రావడంతో అత్యవసర ప్రసవం నిర్వహించారు. 1.5 కిలోలు, 1.5 కిలోలు, 1.4 కిలోల బరువుతో ముగ్గురు మగ శిశువులు జన్మించారు.
HIGHLIGHTS
- 9 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు
- 2026 జనవరిలో గాంధీ ఐవీఎఫ్ కేంద్రంలో చికిత్స
- 32 వారాలకు అత్యవసర ప్రసవం
- ముగ్గురు మగ శిశువులు క్షేమం
- తల్లీబిడ్డలు డిశ్చార్జ్
నెలలు నిండకముందే, తక్కువ బరువుతో పుట్టిన శిశువులను వెంటనే ఎన్ఐసీయూకి తరలించారు. నియోనాటాలజీ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ప్రత్యేక సంరక్షణ అందించడంతో ముగ్గురు చిన్నారులు పూర్తిగా కోలుకున్నారని ఆసుపత్రి అధికారులు తెలిపారు. తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉండటంతో వారిని ఇంటికి పంపినట్లు పేర్కొన్నారు. ఈ క్లిష్టమైన చికిత్సను ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందాన్ని డీఎంఈ డాక్టర్ వాణి, ప్రిన్సిపాల్ ఇందిర, సూపరింటెండెంట్ ఉషారాణి అభినందించారు.
గైనకాలజీ హెచ్ఓడీ ప్రొఫెసర్ శోభ, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ కృష్ణవేణి, నియోనాటాలజీ బృందం సమన్వయంతో చికిత్స కొనసాగిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తల్లి, శిశువులకు రెగ్యులర్ ఫాలోఅప్ పరీక్షలు కొనసాగిస్తామని వైద్యులు చెప్పారు.
Also Read -తెలంగాణలో ఇందిరమ్మ బీమా ప్రారంభం.. రూ.5 లక్షల జీవిత బీమాకు లబ్ధిదారుల ఎంపిక
