రైతులపై కేసులు ఉపసంహరించాలి: హరీశ్ రావు
జూరాల నీటి కోసం ఆందోళన చేసిన రైతులపై కేసుల నమోదును బీఆర్ఎస్ మాజీ మంత్రి ఖండించారు
జూరాల ప్రాజెక్టు నుంచి పంటలకు నీరు విడుదల చేయాలని ఆందోళన చేసిన రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు గురువారం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎక్స్ వేదికగా స్పందించిన హరీశ్ రావు, “కళ్ల ముందే ఎండుతున్న పంటలకు నీరివ్వమని అడిగిన రైతులపై కేసులు పెట్టడం సిగ్గుచేటు” అని అన్నారు. “రేవంత్ రెడ్డి పాలనలో రైతుల చేతులకు బేడీలు వేయడం, పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం పరిపాటిగా మారింది” అని ఆయన విమర్శించారు. పంటలకు నీరందక రైతులు నిలదీస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారా అని ప్రశ్నించారు.
HIGHLIGHTS
- జూరాల నీటి కోసం రైతుల ఆందోళన
- పోలీస్ కేసులపై హరీశ్ రావు ఆగ్రహం
- “ఇది ప్రజా పాలన కాదు” అని విమర్శ
- కేసులు ఉపసంహరించకపోతే పోరాటం హెచ్చరిక
“ఇది ప్రజా పాలన కాదు. ప్రజా పీడన” అని హరీశ్ రావు అన్నారు. “తప్పు ప్రభుత్వం చేస్తే శిక్ష రైతులు అనుభవించాలా?” అని ప్రశ్నించారు. కృష్ణాలో నీటి ప్రవాహాలు ఉన్నప్పుడు నీటిని లిఫ్ట్ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు.
రైతులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Also Read- జూరాల కాలువకు నీళ్లు వదిలిన 14 మంది రైతులపై కేసు నమోదు
