40–45% ల్యాండ్స్ ఇన్ 22ఏ
హైదరాబాద్ చుట్టూ భూముల విలువ ఆకాశాన్ని తాకుతున్న కొద్దీ.. వాటిపై ప్రభుత్వ రికార్డుల్లో పడిన ఒక్క ముద్ర యజమానుల గుండెల్లో గుబులు రేపుతోంది. అదే 22-ఏ. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన నిషేధిత జాబితా.. ఇప్పుడు చట్టబద్ధమైన ప్రైవేట్ ఆస్తులపైనా పడింది. తెలంగాణలో భూ రికార్డుల వ్యవస్థనే ప్రశ్నార్థకం చేస్తోంది.
భూమికి ధర పెరిగితే యజమాని సంపన్నుడవుతాడు. అదే భూమిపై 22-ఏ ముద్ర పడితే ఆ సంపద ఒక్కసారిగా చేతులు కట్టేసిన ఆస్తిగా మారిపోతుంది. ఇదే ఇప్పుడు హైదరాబాద్ భూ మార్కెట్లో ఎదురవుతున్న దారుణ పరిస్థితి.
బంజారాహిల్స్‌లోని భూమి.. జూబ్లీహిల్స్‌లోని స్థలం.. గచ్చిబౌలిలోని ప్లాటు.. మాదాపూర్‌లోని ఆస్తి.. షేక్‌పేట్‌లోని భూమి.. అమీర్‌పేట్, ఖైరతాబాద్, పంజాగుట్టలోని ప్రాపర్టీ.. వీటిలో ఏదైనా కోట్ల విలువైనదే. కానీ రికార్డులో 22-ఏ ముద్ర పడితే అంతా తల్లకిందులవుతోంది. ఆస్తి విలువ ఉన్నా లావాదేవీ విలువ తగ్గిపోతుంది. అమ్మాలని చూసినా చిక్కు. కొనేవాడు ముందుకు రావాలన్నా అనుమానం. బ్యాంకు రుణం కావాలన్నా ప్రశ్న. పెట్టుబడి పెట్టాలన్నా వెనకడుగు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని నిషేధిత ఆస్తుల్లో 40–50 శాతం వరకు ఉన్నట్టు, వాటి విలువ లక్షల కోట్ల రూపాయల్లో ఉంది. అంటే 22-ఏ సమస్యకు ఇప్పుడు కొత్త కొలమానం వచ్చింది. ఎన్ని భూములు? అనే ప్రశ్నతో పాటు.. ఎంత ఆస్తి విలువ నిషేధిత జాబితాలో చిక్కుకుంది? అన్నది కూడా లెక్కలోకి వచ్చింది.
ఒక ఆస్తి 22-ఏలోకి వెళ్లినప్పుడు కాగితంపై యజమాని మారకపోవచ్చు. కానీ ఆస్తి చలామణి ఆగిపోతుంది. అదే అసలు ప్రమాదం. రూ.3 కోట్ల ప్లాటు అమ్మి పిల్లల చదువుకు డబ్బు సమకూర్చుకోవాలనుకున్న కుటుంబం ఆగిపోవచ్చు. రూ.5 కోట్ల భూమిని తాకట్టు పెట్టి వ్యాపారం విస్తరించాలనుకున్న వ్యక్తి వెనక్కి తగ్గాల్సి రావచ్చు. పాత ఆస్తిని విక్రయించి కొత్త ఇంటికి మారాలనుకున్న కుటుంబం మధ్యలో ఇరుక్కోవచ్చు.
అంటే 22-ఏ ముద్ర కేవలం రిజిస్ట్రేషన్ కార్యాలయ తలుపు మూయదు. ఆస్తి ఆధారంగా జరిగే ఆర్థిక లావాదేవీల తలుపులనూ మూసేస్తుంది.
నగరంలోని అత్యంత విలువైన ప్రాంతాల పేర్లు ఇప్పుడు ఈ వివాదంలో వినిపిస్తున్నాయి. బంజారాహిల్స్.. జూబ్లీహిల్స్.. గచ్చిబౌలి.. మాదాపూర్.. షేక్‌పేట్.. ఈ ప్రాంతాల్లో భూమి ధరలు సాధారణ కుటుంబాల ఊహకు కూడా అందని స్థాయిలో ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తులే 22-ఏలో చిక్కుకుంటే.. సమస్యను కేవలం రెవెన్యూ రికార్డు సవరణగా చూడలేం. ఇది నగర ఆస్తులపై నమ్మకానికి సంబంధించిన అంశంగా మారుతుంది.
ఎందుకంటే హైదరాబాద్‌లో ఒక ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారుడు కేవలం అమ్మకందారుడి పత్రాలను చూడడు. ప్రభుత్వ రికార్డును నమ్ముతాడు.
ప్రభుత్వం చెబుతున్న వివరణ ప్రకారం గతంలో జారీ చేసిన జీవోలు, ఉత్తర్వులు రికార్డుల్లో సక్రమంగా అప్డేట్ కాకపోవడం, కొన్ని సందర్భాల్లో మొత్తం సర్వే నంబర్‌ను నిషేధితంగా చూపించడం వంటి కారణాలతో ప్రైవేట్ భూములూ జాబితాలోకి వెళ్లాయి.
ప్రభుత్వం ఒకప్పుడు ఇచ్చిన క్లియరెన్స్ ఒక రికార్డులో ఉంది. మరో రికార్డులో అది కనిపించటం లేదు. ఆ రెండో రికార్డునే తర్వాతి దశలో ఆధారంగా తీసుకున్నారు. అక్కడే ప్రైవేట్ ఆస్తికి 22-ఏ ముద్ర పడింది.
ఒక సర్వే నంబర్లో కొంత భూమి ప్రభుత్వ పరిధిలో ఉండొచ్చు. మిగిలిన భాగం ప్రైవేట్ యజమానులదై ఉండొచ్చు. అలాంటి సందర్భంలో వివాదాస్పద భాగాన్ని మాత్రమే గుర్తించాల్సి ఉంటుంది. కానీ మొత్తం సర్వే నంబర్ మొత్తాన్ని నిషేధిత జాబితాలో చేరిస్తే వివాదంలో లేని భూమికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
నిషేధిత జాబితా ప్రకటించే విషయంలో ప్రభుత్వం వైపు నుంచి కూడా తప్పు జరిగిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంగీకరించారు. అదే సమయంలో ఆయన ప్రకటించిన విషయాలను ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. 12 ఎకరాల భూమిలో 2 ఎకరాలు భూదాన్ భూమి ఉన్నప్పటికీ మొత్తం 12 ఎకరాలు నిషేధిత జాబితాలోకి చేరిపోయిందని మంత్రి చెప్పారు.
ఈ లెక్కన వేలాది ఎకరాలు నిషేధ జాబితాలోకి చేరిపోయాయి. గతంలో క్లియర్ చేసిన భూముల వివరాలు రికార్డుల్లో అప్డేట్ కాకపోవడంతో సుమారు 35 వేల నుంచి 38 వేల పార్సిళ్లు నిషేధిత జాబితాలో చేరాయని మంత్రి చెబుతున్నారు.
38 వేల పార్సిళ్లు అంటే 38 వేల భూ రికార్డులు. ఇన్నివేల రికార్డులు తేడాగా ఉండటాన్ని ఎలా తీసుకోవాలి? వేలాది కుటుంబాల ఆర్థిక ప్రణాళికలు తల్లకిందులయ్యాయి. వేలాది కొనుగోలు, అమ్మకాల అవకాశాలు నిలిచిపోయాయి. అనేక బ్యాంకు రుణాలు, అనేక నిర్మాణ ప్రాజెక్టులు స్తంభించిపోయాయి. వ్యవహారాన్ని “కొన్ని రికార్డులు తప్పుగా అప్డేట్ అయ్యాయి” అని తేలికగా తీసుకోవడం కుదరదు.
ఇప్పటి వరకూ 757 మంది ప్రభుత్వ తలుపు తట్టారు. మరి మిగిలిన వాళ్ల మాటేమిటి? 22-ఏ నుంచి తమ ఆస్తులను తొలగించాలంటూ ఇప్పటివరకు మేడ్చల్-మల్కాజిగిరి నుంచే అత్యధికంగా 511 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే రంగారెడ్డి నుంచి 146, హైదరాబాద్ నుంచి 49, సంగారెడ్డి నుంచి 38 దరఖాస్తులు వచ్చాయి.
అధికారికంగా ఇంకా వెలుగులోకి రాని కేసులు మరికొన్ని ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు. రిజిస్ట్రేషన్లకు వెళ్లేదాకా తమ భూమి నిషేధిత జాబితాలో చేరిందో లేదో అన్న విషయం సామాన్యులకు తెలిసే అవకాశం లేకపోవటం మరో కారణం.
తప్పిదాలు జరిగాయి. రికార్డులు సరిచేస్తామని ప్రభుత్వం చెబుతోంది. బాధితుల నుంచి దరఖాస్తులు తీసుకుంటోంది. కమిటీ ఏర్పాటు చేస్తోంది. అయితే ఇక్కడ ఎదురవుతున్న ప్రశ్న ఏమిటంటే.. తప్పు ప్రభుత్వ రికార్డులో జరిగితే దాన్ని నిరూపించడానికి పౌరుడు ఎందుకు కార్యాలయాల చుట్టూ తిరగాలి? సరే అని దరఖాస్తు చేసుకుంటే, ఆ సమస్య పరిష్కారం కావటానికి ఎంత సమయం పడుతుంది?
22-ఏ ముద్ర భూమిని స్వాధీనం చేసుకోకపోయినా దాని మీదున్న ఆర్థిక స్వేచ్ఛను కట్టడి చేస్తుంది. ఇది ఆస్తి యజమానికి కనిపించని నష్టం.
అడ్వాన్స్ నుంచి అగ్రిమెంట్ వరకు మధ్యలో డబ్బు చిక్కుకుపోతుంది. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ముందస్తు ఒప్పందాలు, అడ్వాన్సులు, రుణ ఏర్పాట్లు, ఇతర చెల్లింపులు సాధారణమే. ఒక ఆస్తిపై 22-ఏ సమస్య చివరి దశలో బయటపడితే కొనుగోలుదారు, అమ్మకందారు ఇద్దరూ ఇబ్బందిలో పడతారు.
కొనుగోలుదారు ఇప్పటికే సమకూర్చుకున్న డబ్బును వెనక్కి మళ్లించాల్సి రావచ్చు. అమ్మకందారు ఆ డబ్బుతో చేయాలనుకున్న మరో పెట్టుబడి ఆగిపోవచ్చు. మధ్యలో బ్రోకర్లు, డెవలపర్లు, నిర్మాణ సంస్థలు, బ్యాంకులు కూడా ప్రభావితమవుతాయి.
అందుకే ఒక రిజిస్ట్రేషన్ నిలిచిపోవడం అనేది ఒక్క డాక్యుమెంట్ పెండింగ్‌లో పడటం కాదు.. అనేక ఆర్థిక నిర్ణయాలు ఒకేసారి నిలిచిపోతాయి.
ప్రభుత్వానికీ ఆదాయ నష్టం తప్పదు. ఆస్తి లావాదేవీ జరిగినప్పుడు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ తదితర రూపాల్లో ఆదాయం వస్తుంది. లావాదేవీలు నిలిచిపోతే ఆ ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఇది ఒక్క ఆస్తికి పెద్ద మొత్తం కాకపోవచ్చు. భారీ విలువ కలిగిన ఆస్తులు పెద్ద సంఖ్యలో లావాదేవీలకు దూరమైతే ప్రభావం కూడా పెద్దదవుతుంది.
అంటే 22-ఏ వివాదం ప్రభావం ఆస్తి యజమాని నుంచి కొనుగోలుదారులు, ఆ తర్వాత బ్యాంకింగ్ రంగం.. నిర్మాణ రంగం, సేవల రంగం, చివరకు ప్రభుత్వంపైన పడుతుంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో అత్యంత కీలకమైనది భూమి ధర మాత్రమే కాదు. టైటిల్‌పై నమ్మకం. భూమి ధర ఎంత ఉన్నా.. దాని యాజమాన్య రికార్డుపై సందేహం ఉంటే కొనుగోలుదారు వెనక్కి తగ్గుతాడు.
22-ఏ వివాదం విస్తరించినకొద్దీ కొనుగోలుదారులు మరింత జాగ్రత్తగా పత్రాలను పరిశీలించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మంచిదే అయినా ప్రతి ఆస్తిపైన వివాదం ఏర్పడితే లావాదేవీలు నిలిచిపోతాయి. అందుకే ప్రభుత్వం 22-ఏ వివాదాల పరిష్కారానికి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. చిక్కుకుపోయిన ఆస్తిని విడిపించటానికి ప్రయత్నించాలి.
