99TV News

    అండాల అక్రమ రవాణా కేసు: హైదరాబాద్‌లో Oasis తనిఖీలు

    పేద మహిళలే టార్గెట్: అండాల అక్రమ రవాణా కేసులో కీలక విషయాలు

    పేద మహిళలే టార్గెట్‌గా అండాల అక్రమ సేకరణ కేసు దర్యాప్తు విస్తరణ

    ఒయాసిస్ కార్పొరేట్ ఆఫీసులో పోలీసుల తనిఖీలు; డిజిటల్ పరికరాలు, డోనర్ రికార్డుల స్వాధీనం

    హైదరాబాద్‌లో అండాల అక్రమ సేకరణ కేసులో దర్యాప్తును పోలీసులు శుక్రవారం మరింత విస్తరించారు. పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని డబ్బు ఆశ చూపి, ఫర్టిలిటీ కేంద్రాలకు పరిచయం చేసిన వ్యవస్థీకృత నెట్‌వర్క్‌పై అధికారులు దృష్టి సారించారు.

    ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఎమిరిశెట్టి దుర్గాప్రసాద్‌ను కస్టడీలో విచారించగా కీలక సమాచారం లభించినట్లు పోలీసులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. “మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుడిని అదనపు కస్టడీకి తీసుకున్నాం,” అని పోలీస్ అధికారులు ప్రకటనలో తెలిపారు. మహిళలను ఫర్టిలిటీ కేంద్రాలు, ఏఆర్టీ బ్యాంకులకు పరిచయం చేయడంలో అతడి పాత్ర, ఆర్థిక లావాదేవీలు, ఇతర సహచరుల వివరాలను పరిశీలిస్తున్నామని వారు చెప్పారు.

    దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లోని ఒయాసిస్ హాస్పిటల్స్ కార్పొరేట్ కార్యాలయంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ల్యాప్‌టాప్‌లు, ఇతర డిజిటల్ పరికరాలు, డోనర్లకు సంబంధించిన రికార్డులు, ఆర్థిక లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. “స్వాధీనం చేసుకున్న ఆధారాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపిస్తున్నాం,” అని దర్యాప్తు అధికారులు తెలిపారు.

    HIGHLIGHTS

    - ఎమిరిశెట్టి దుర్గాప్రసాద్ అదనపు కస్టడీ

    - ఒయాసిస్ కార్పొరేట్ ఆఫీసులో తనిఖీలు

    - డోనర్ రికార్డులు, డిజిటల్ పరికరాల స్వాధీనం

    - ఫర్టిలిటీ కేంద్రాల పాత్రపై విచారణ

    పేద మహిళలను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి అండాల సేకరణకు వినియోగించారనే ఆరోపణలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి చట్టాన్ని దుర్వినియోగం చేశారన్న అంశంపైనా ఆధారాలు సేకరిస్తున్నారు. “ఫర్టిలిటీ కేంద్రాల డైరెక్టర్లు, కోఆర్డినేటర్లు, ఏజెంట్ల పాత్రను అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నాం,” అని పోలీసులు తెలిపారు.

    కమిషన్ విధానం ద్వారా మహిళలను సమీకరించినారా, ఏఆర్టీ బ్యాంకులతో మధ్యవర్తుల సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయన్నది ప్రస్తుతం దర్యాప్తులో కీలకాంశంగా మారింది. స్వాధీనం చేసిన రికార్డుల విశ్లేషణ, ఆర్థిక లావాదేవీల పరిశీలన పూర్తయిన తర్వాత మరిన్ని నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తదుపరి దశలో సంబంధిత ఫర్టిలిటీ కేంద్రాల నిర్వాహకులను విచారించనున్నారు.

    Also Read -దీక్షా దివస్‌కు ప్రజలు భారీగా తరలిరావాలి: గంగుల కమలాకర్ పిలుపు