99TV News

    ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ: గెజిట్ జారీ

    ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ.. దానం నాగేందర్ సభ్యత్వం రద్దుపై గెజిట్

    ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా గెజిట్ నోటిఫికేషన్ జారీ

    దానం నాగేందర్ సభ్యత్వం 2024 ఏప్రిల్ 23 నుంచి రద్దయినట్లు తెలంగాణ శాసనసభ నోటిఫికేషన్‌లో స్పష్టీకరణ

    తెలంగాణలో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లు తెలంగాణ శాసనసభ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యత్వం 2024 ఏప్రిల్ 23 నుంచి రద్దయినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

    2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ విజయం సాధించారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌లో చేరి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఆ పిటిషన్లను స్పీకర్ తిరస్కరించడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.

    హైకోర్టు డివిజన్ బెంచ్ సెప్టెంబర్ 18న ఇచ్చిన తీర్పులో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలోనే కాంగ్రెస్ తరఫున లోక్‌సభకు పోటీ చేసినందున అనర్హత అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, అక్కడ ఆయన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో శాసనసభ నోటిఫికేషన్ ద్వారా ఖైరతాబాద్ స్థానాన్ని ఖాళీగా గుర్తించింది.

    HIGHLIGHTS

    - ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా గుర్తింపు

    - దానం సభ్యత్వం 2024 ఏప్రిల్ 23 నుంచి రద్దు

    - సెప్టెంబర్ 18న హైకోర్టు కీలక తీర్పు

    - సుప్రీంకోర్టులోనూ దానం పిటిషన్ తిరస్కరణ

    ఈ పరిణామంతో దానం నాగేందర్ ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా మారారు. ఉప ఎన్నికపై ఎన్నికల కమిషన్ తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో తానే మళ్లీ విజయం సాధిస్తానని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.