తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. అధికార కాంగ్రెస్ పార్టీకే చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి మాట్లాడే భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా మద్దతు పలకడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది
మునుగోడు నియోజకవర్గానికి నిధులు కేటాయించడంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. కొడంగల్, మధిర, హుజూర్‌నగర్ నియోజకవర్గాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. కొడంగల్‌కు రూ.10 వేల కోట్లు కాదు.. రూ.20 వేల కోట్లు తీసుకెళ్లినా తనకు అభ్యంతరం లేదని, అయితే వెనుకబడిన మునుగోడు అభివృద్ధిని కూడా పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న ప్రాంతానికి కనీసం రూ.500 కోట్లైనా కేటాయించాలని కోరారు. డిండి ఎత్తిపోతల పథకం, చౌటుప్పల్‌లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం వంటి పనులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు.
Also Read- స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధిపై కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
తనకు మంత్రి పదవిపై ఎలాంటి ఆశ లేదని, మునుగోడు ప్రజలకు న్యాయం జరగడమే ముఖ్యమని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి నిధుల కోసం విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మునుగోడుకు అన్యాయం జరిగితే మరో కురుక్షేత్రానికి సిద్ధమని హెచ్చరించారు.
మరోవైపు రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు పలకడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రిని ప్రశ్నించే విషయంలో రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు . రాజాసింగ్ ఏమన్నారంటే.. సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయి.. గత ప్రభుత్వంలో ఇలా నిధుల సమస్య రాలేదు.. అధికారులతో కమ్యూనికేషన్ గ్యాప్ కూడా లేకుండే ఇప్పుడున్న అధికారులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు అని వ్యాఖ్యానించారు. అన్ని నియోజకవర్గాల అభివృధ్ధికి కేసీఆర్ కృషిచేశారని రాజాసింగ్ మద్దతు పలకటం కొసమెరుపు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రిపై బహిరంగంగా విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. దీనికి రాజాసింగ్ మద్దతు తోడవడంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
