మక్తల్లో ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు వేయిస్తా: మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం.. ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు వేయిస్తా
61 కోట్లతో రాజీవ్ భీమా ఎత్తిపోతల లిఫ్ట్-2 సమాంతర కాలువ లైనింగ్ పనులకు భూమిపూజ
అభివృద్ధిని చెరిపివేయడం ఎవరి తరం కాదు.. మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి వచ్చిన అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటానని రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఆత్మకూరు మండలం మూలమళ్ల గ్రామం వద్ద 61 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం లిఫ్ట్-2 సమాంతర కాలువకు సంబంధించి 17 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులకు మంత్రి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ....
ఈ కీలక పనులకు బడ్జెట్ కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకురావడం ఎంత కష్టమో ప్రజాప్రతినిధులకు తెలుసని, నిరంతర కృషితోనే నియోజకవర్గానికి అభివృద్ధి పనులు తీసుకురాగలుగుతున్నామని పేర్కొన్నారు.
మక్తల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రోడ్లను మెరుగుపరిచి, ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు వేయించే బాధ్యత తనదేనని మంత్రి హామీ ఇచ్చారు. తన హయాంలో జూరాల వద్ద వంతెన నిర్మాణం చేపట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆత్మకూరులో 50 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. పరమేశ్వర చెరువును అభివృద్ధి చేయడంతో పాటు ఆలయం వరకు రహదారి నిర్మించామని గుర్తుచేశారు.
రాజకీయాల్లో వ్యక్తులను విమర్శించవచ్చని, కానీ ప్రజల కోసం చేసిన అభివృద్ధి పనులను ఎవరూ చెరిపివేయలేరని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజలకు కనిపించే అభివృద్ధే తనకు అసలైన గుర్తింపు అని స్పష్టం చేశారు.
Also Read- కృష్ణా డెల్టాకు నీటిపై ఏపీ, తెలంగాణ పట్టు.. నిర్ణయం లేక ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం
HIGHLIGHTS
- రూ.61 కోట్లతో కాలువ లైనింగ్ పనులు
- 17 కిలోమీటర్ల మేర పనులకు భూమిపూజ
- ప్రతి గ్రామానికి బీటీ రోడ్ల హామీ
- ఆత్మకూరులో 50 పడకల ఆసుపత్రి
వరదలు వస్తే జూరాల డ్యామ్ కూలిపోతుందని ప్రతిపక్షాలు విషప్రచారం చేశాయని మంత్రి మండిపడ్డారు. జూరాల ప్రాజెక్టును నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుచేస్తూ...తాము నిర్మించిన జూరాల గురించి మాట్లాడే ముందు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిని గుర్తు చేసుకోవాలని మంత్రి చురకలంటించారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క పేదవాడికైనా ఇల్లు ఇచ్చారా అని,ఒక్క నిరుపేద కుటుంబానికైనా న్యాయం చేశారా అని మంత్రి వాకిటి శ్రీహరి ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుంటే అవి కేవలం కాగితాలకే పరిమితమవుతాయని ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయని, కానీ తమ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.
2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంకెనపల్లి, అనుగొండ గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించిందని, అయితే 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని రద్దు చేసిందని మంత్రి వివరించారు. మళ్లీ గత ఎన్నికల సమయంలో అదే గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటిస్తామని బీఆర్ఎస్ నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
రైతులు సాగునీటి వినియోగంపై తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలని మంత్రి సూచించారు. ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఆరుతడి పంటలు సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గంలో సాగునీరు, రహదారులు, విద్య, వైద్యం వంటి అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.
