హైదరాబాద్:
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం చోటుచేసుకుంది. తాళం వేసి ఉన్న ఒక ఇంట్లోకి చొరబడిన దుండగులు రూ. లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును ఊడ్చేశారు.
కొమురవెల్లి వెళ్లిన సమయంలో ఘటన
బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ న్యూ భరత్ నగర్ ప్రాంతంలో గంగం భాస్కర్ రెడ్డి, బాలమణి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు సోమవారం మధ్యాహ్నం కొమురవెల్లి క్షేత్ర దర్శనానికి వెళ్లారు. మంగళవారం ఉదయం నిత్యం వచ్చే పనిమనిషి ఇల్లు శుభ్రం చేసేందుకు రాగా, ఇంటి తలుపులు తీసి ఉండటం గమనించింది. అనుమానం వచ్చి వెంటనే చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చి పరిశీలించగా ఇంట్లో చోరీ జరిగినట్లు తేలింది.
48 తులాల బంగారం అపహరణ
సమాచారం అందుకున్న గంగం భాస్కర్ రెడ్డి వెంటనే కొమురవెల్లి నుంచి బయలుదేరి ఇంటికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లోని బీరువా తలుపులు తీసి ఉండి, అందులో ఉన్న సుమారు 48 తులాల విలువైన బంగారు ఆభరణాలు, 1.5 కేజీల వెండి వస్తువులు మరియు రూ. 3.5 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు.
Also Read - హైదరాబాద్‌లో భారీ శబ్దం.. ఉలిక్కిపడ్డ రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ స్థానికులు!
ఈ దొంగతనంపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ దుండగుల కోసం గాలింపు వేగవంతం చేశారు.
