99TV News

    స్వచ్ఛ వాయు సర్వేక్షణలో నల్లగొండకు 2వ ర్యాంక్.. రూ.20 లక్షల అవార్డు

    స్వచ్ఛ వాయు సర్వేక్షణలో నల్లగొండకు 2వ ర్యాంక్.. రూ.20 లక్షల అవార్డు

    నల్లగొండ, సెప్టెంబర్ 07: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక గుర్తింపు సాధించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్‌ (NCAP)లో భాగంగా నిర్వహించిన వార్డు స్థాయి స్వచ్ఛ వాయు సర్వేక్షణ–2026లో నల్లగొండకు 2వ ర్యాంక్‌ దక్కింది.

    దేశవ్యాప్తంగా 130 పట్టణ స్థానిక సంస్థలు (ULBs) పాల్గొన్న ఈ సర్వేక్షణలో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ నంబర్–16 కేటగిరీ–3లో జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని సాధించింది. ఈ సందర్భంగా అవార్డుతో పాటు రూ.20 లక్షల నగదు బహుమతి లభించింది.

    న్యూఢిల్లీలో అవార్డు ప్రదానం

    సెప్టెంబర్ 7న న్యూఢిల్లీలోని ఇందిరా పర్యావరణ భవన్‌లో గంగా ఆడిటోరియంలో నిర్వహించిన స్వచ్ఛ వాయు దివస్–2026 కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బి. వంశీకృష్ణ, వార్డు నంబర్–16 కార్పొరేటర్ పెరిక స్వాతి అవార్డును స్వీకరించారు.

    పలు చర్యలకు గుర్తింపు

    గాలి నాణ్యత మెరుగుదల, రహదారి దుమ్ము నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ, పచ్చదనం పెంపు, ప్రజల్లో అవగాహన వంటి అంశాల ఆధారంగా సర్వేక్షణ నిర్వహించారు. నల్లగొండ నగరంలో జంక్షన్ల అభివృద్ధి, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, బ్లాక్ ప్లాంటేషన్, ట్రాఫిక్ కారిడార్లలో పచ్చదనం పెంపు, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల (GVP) రూపాంతరం, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ (MRF) ప్లాంట్ వంటి చర్యలను చేపట్టారు.

    నంబర్–1 కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతాం

    ఈ సందర్భంగా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ స్థాయి అవార్డు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌కు రావడం గర్వకారణమన్నారు. నల్లగొండ ఎమ్మెల్యే, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహాయ సహకారాలతో నగర అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. అన్ని డివిజన్లలో మెరుగైన మౌలిక వసతులు, ఆధునిక పట్టణ సౌకర్యాలు కల్పిస్తూ నల్లగొండను తెలంగాణలోనే నంబర్–1 కార్పొరేషన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు.

    కమిషనర్ బి. వంశీకృష్ణ మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకారం, మేయర్ మార్గదర్శకత్వంలో నగరానికి మెరుగైన పట్టణ మౌలిక వసతులు, ఆధునిక పౌర సౌకర్యాలు, పరిశుభ్రమైన పరిసరాలు, పచ్చదనం, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను అందించే దిశగా చర్యలు కొనసాగుతాయని తెలిపారు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నల్లగొండ నిర్మాణానికి మరింత సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు.