సొంత ఇంటిని అమ్ముకోవాలన్న అత్యవసరానికి ప్లాట్‌ను తాకట్టు పెట్టి రుణం తెచ్చుకోవాలన్నా ఆస్తిని విక్రయించాలన్నా యజమానికి కొత్త సమస్య ఎదురవుతోంది. చేతిలో హక్కు పత్రాలున్నా.. ఆస్తి 22ఏ నిషేధిత జాబితాలో ఉంటే రిజిస్ట్రేషన్ ఆగిపోతోంది. దాన్నుంచి బయటపడేందుకు ఎన్‌వోసీ కోసం మరో గడప తొక్కాల్సి వస్తోంది.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ఉప్పల్, కూకట్‌పల్లి, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో 22ఏ జాబితాలోకి వెళ్లిన ప్రైవేట్ ఆస్తుల యజమానులు ఎన్‌వోసీల కోసం కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఫైళ్లు ముందుకు కదలడం లేదని గగ్గోలు పెడుతున్నారు.
22ఏ ఉద్దేశం ప్రభుత్వ లేదా చట్టపరంగా బదలాయింపు నిషేధిత ఆస్తులు చేతులు మారకుండా అడ్డుకోవడం. కాని ప్రైవేట్ ఆస్తి పొరపాటున జాబితాలో చేరితే.. దాన్ని తొలగించుకునేందుకు యజమాని నానాకష్టాలు పడవలసి వస్తోంది. దరఖాస్తులు, విచారణలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు తప్పటం లేదు.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని పలు కేసులు ఈ సమస్య తీవ్రతను చూపిస్తున్నాయి. 2026లో కుత్బుల్లాపూర్, గుండ్లపోచంపల్లి తదితర ప్రాంతాలకు సంబంధించిన 22ఏ వివాదాలు హైకోర్టుకు వెళ్లాయి. ఒక కేసులో ఆన్‌లైన్ దరఖాస్తు తీసుకుని, సంబంధితులకు నోటీసులు ఇచ్చి, విచారణ అనంతరం నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు అధికారులను ఆదేశించింది.
అంటే.. 22ఏలోకి చేర్చడం వేగంగా జరిగినా, బయటకు రావడం మాత్రం సుదీర్ఘ ప్రక్రియగా మారుతోంది.
యూఎల్‌సీ, ప్రభుత్వ భూములు లేదా ఇతర నిషేధిత వర్గాలకు సంబంధం లేని ప్రైవేట్ ఆస్తులకు క్లియరెన్స్ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించినా క్షేత్రస్థాయిలో ఫైళ్లు పెండింగ్‌లోనే ఉంటున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.
దీంతో యజమాని వద్ద పత్రాలున్నాయి. కొనుగోలుదారు సిద్ధంగా ఉన్నాడు. ఆస్తి అమ్ముకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఒక్క ఫైలు కదలకపోవడంతో మొత్తం లావాదేవీ నిలిచిపోతోంది.
దీని ప్రభావం రిజిస్ట్రేషన్‌తోనే ఆగడం లేదు. బ్యాంకు రుణాలు, ఆస్తి మార్కెట్ విలువ, కుటుంబ అత్యవసరాలకు ఆస్తిని నగదుగా మార్చుకునే అవకాశం కూడా దెబ్బతింటోంది.
ఎన్‌వోసీ విషయంలో మరో కీలకమైన న్యాయపరమైన ప్రశ్న ఉంది. 2026లో తెలంగాణ హైకోర్టు విచారించిన ఒక కేసులో, గత తీర్పును ప్రస్తావిస్తూ ప్రతి సందర్భంలో రెవెన్యూ ఎన్‌వోసీని రిజిస్ట్రేషన్ కోసం తప్పనిసరిగా పట్టుబట్టడం చట్టబద్ధ అవసరం కాదని వ్యాఖ్యానించింది.
అదే సమయంలో 22ఏ నుంచి భూములను తొలగించేందుకు ఎన్‌వోసీ కోరిన కేసులు కూడా కోర్టుల ముందుకు వస్తున్నాయి.
దీంతోఎన్‌వోసీ ఎప్పుడు తప్పనిసరి? ఎవరు ఇవ్వాలి? ఎంతకాలంలో ఇవ్వాలి? అనే స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఒకవేళ తిరస్కరిస్తే... దానిని ఎందుకు తిరస్కరించారనేది కూడా స్పష్టం చేయవలసిన కారణం ఉంది.
తప్పుగా 22ఏలో చేరిన ప్రైవేట్ ఆస్తిని ఒకసారి పూర్తిగా పరిశీలించి, అది నిషేధిత వర్గానికి చెందదని నిర్ధారిస్తే.. జాబితా నుంచే తొలగించాలి. ప్రతి లావాదేవీకి మళ్లీ మళ్లీ ఎన్‌వోసీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదు.
అందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, పెండింగ్ దరఖాస్తులను కాలపరిమితిలో పరిష్కరించాలి. ఫైలు ఏ అధికారి వద్ద ఉందో ఆన్‌లైన్‌లో కనిపించేలా చేయాలి. తిరస్కరిస్తే కారణాలను రాతపూర్వకంగా వెల్లడించాలి.
22ఏ నిషేధిత జాబితా ప్రభుత్వ ఆస్తులను కాపాడేదిగా ఉందడాలి. ప్రైవేట్ ఆస్తులను బంధించడానికి కాదు. తప్పు ఎంట్రీకి బాధ్యత యజమానిపై కాదు.. దాన్ని సరిచేయాల్సిన వ్యవస్థపైనే ఉండాలి.
ఈ జాప్యాన్ని కొందరు మధ్యవర్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దకు వచ్చే బాధితులతో కొందరు దస్తావేజులేఖర్లు, మధ్యవర్తులు “ఎన్‌వోసీ ఇప్పిస్తాం” అంటూ సంప్రదిస్తున్నారని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు.
ఆస్తి విలువ, అత్యవసరతను బట్టి డబ్బులు అడుగుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ ఆరోపణలు నిజమా కాదా అన్నది విచారణలో తేలాల్సి ఉన్నా ప్రభుత్వ అనుమతి కోసం మధ్యవర్తిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడితే అది వ్యవస్థ పారదర్శకతపైనే ప్రశ్న.
