కోడి ఫామ్‌లో రహస్య డ్రగ్స్ ల్యాబ్‌ను గుర్తించిన తెలంగాణ ఈగల్ ఫోర్స్
గోండియా జిల్లాలో తయారీ కేంద్రం బయటపడగా, 11 మంది అరెస్ట్; మరో 13 మంది కోసం గాలింపు కొనసాగుతోంది
తెలంగాణ ఈగల్ ఫోర్స్ పోలీసులు అంతర్రాష్ట్ర సింథటిక్ డ్రగ్స్ తయారీ, సరఫరా ముఠా కార్యకలాపాలను వెలుగులోకి తీసుకొచ్చారు. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో కోడి ఫామ్‌లో రహస్యంగా నడుస్తున్న డ్రగ్స్ ల్యాబ్‌ను గుర్తించి, మొత్తం 24 మంది నిందితుల్లో 11 మందిని అరెస్ట్ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలతో ఈ వ్యవహారం బయటపడింది. కొండమడుగు నుంచి నాగ్‌పూర్ వైపు వెళ్తున్న తెల్లటి ఎస్‌యూవీని పోలీసులు ఆపి తనిఖీ చేయగా, 27.2 కిలోల మెఫెడ్రోన్ డ్రగ్స్‌తో పాటు తయారీకి వినియోగించే 56.98 కిలోల ఎసిటోన్ రసాయనం స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న చేతన్ మధుకర్ మేష్రామ్, ముజమ్మిల్ హక్, ఆకాష్ అశోక్ గవాండేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును ఎన్‌డీపీఎస్ చట్టం కింద నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు.
ప్రాథమిక విచారణలో ఈ సరుకు తెలంగాణ నుంచి మహారాష్ట్రకు సంబంధించిన విస్తృత నెట్‌వర్క్‌లో భాగమని అధికారులు గుర్తించారు. ఆ తర్వాత కేసు దర్యాప్తు తెలంగాణ ఈగల్ ఫోర్స్‌కు అప్పగించారు. దర్యాప్తులో రసాయనాల సమీకరణ, ల్యాబ్ నిర్వహణ, తయారీ పరికరాల ఏర్పాటు, డ్రగ్స్ పంపిణీ వంటి అంశాలు ఒకే గొలుసులా అనుసంధానమై ఉన్నట్లు అధికారులు తెలిపారు. గోండియా జిల్లాలోని కోడి ఫామ్‌ను బయటకు సాధారణ వ్యవసాయ స్థలంలా చూపిస్తూ, లోపల సింథటిక్ డ్రగ్స్ తయారీకి వినియోగించినట్లు పోలీస్ వర్గాలు చెప్పాయి.
HIGHLIGHTS
- 27.2 కిలోల మెఫెడ్రోన్ స్వాధీనం
- 56.98 కిలోల ఎసిటోన్ రసాయనం లభ్యం
- మొత్తం 24 మంది నిందితులు గుర్తింపు
- 11 మంది అరెస్ట్, 13 మంది పరారీ
- గోండియా కోడి ఫామ్‌లో రహస్య ల్యాబ్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశారు. మరో 13 మంది నిందితులు పరారీలో ఉన్నారు. అరెస్టయిన వారి విచారణలో వచ్చిన సమాచారంతో మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో రహస్య ల్యాబ్ ఆనవాళ్లు గుర్తించారు. ఈ ల్యాబ్‌కు రసాయనాలు ఎలా చేరాయి, తయారైన డ్రగ్స్ ఎక్కడికి పంపిణీ అయ్యాయి, ఈ నెట్‌వర్క్‌కు ఆర్థిక సహకారం అందించినవారు ఎవరన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా ప్రత్యేకంగా పనిచేస్తున్న ఈగల్ ఫోర్స్, ఈ కేసును అంతర్రాష్ట్ర ముఠా కోణంలో పరిశీలిస్తోంది. బీబీనగర్‌లో పట్టుబడిన వాహనం ఈ ముఠా కార్యకలాపాల్లో కీలక లింక్‌గా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మొబైల్ కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలు, ప్రయాణ వివరాలు, రసాయనాల కొనుగోలు రికార్డులను పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు తెలంగాణ, మహారాష్ట్రలో ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. స్వాధీనం చేసుకున్న రసాయనాలు, డ్రగ్స్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించగా, నివేదికల ఆధారంగా తదుపరి అరెస్టులు, చార్జ్‌షీట్‌పై పోలీసులు నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read- ఆర్డీఎస్‌కు నీరు చేరలేదా? కర్ణాటకపై శ్రీనివాస్ గౌడ్ ఆరోపణలు
