99TV News

    Telangana Power Cuts: సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు హెచ్చరిక

    Telangana Power Cuts: సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు హెచ్చరిక

    విద్యుత్ కోతలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. అధికారులకు తీవ్ర హెచ్చరిక

    తెలంగాణలో తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పదేపదే ఆదేశాలు ఇచ్చినా పరిస్థితి మారకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, నిర్లక్ష్యం కొనసాగితే ఉన్నతాధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    విద్యుత్ సరఫరా పరిస్థితిపై నిర్వహించిన సమీక్షలో విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు సరఫరా, అంతరాయాలకు గల కారణాలపై సీఎం ప్రశ్నలు సంధించారు. నైనీ, మహానది నుంచి బొగ్గు సరఫరాకు ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో ఎందుకు లేదని నిలదీశారు. విద్యుత్ కోతలకు కారణాలపై తక్షణమే నివేదిక సమర్పించాలని, సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని ఆదేశించారు. పరిస్థితి మెరుగుపడకపోతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జెన్‌కో సీఎండీ సహా బాధ్యులపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    యూకే ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చలు

    మరోవైపు, యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన మేయర్ల ప్రతినిధి బృందంతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హెల్త్‌కేర్, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, ఏరోస్పేస్, టెక్స్‌టైల్స్, పరిశోధన, తయారీ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను వివరించారు.

    ఈ సందర్భంగా యూకే-ఇండియా బిజినెస్ కౌన్సిల్ రూపొందించిన ‘యూకే-ఇండియా సీఈటీఏ అండ్ రీజనల్ సినర్జీస్’ నివేదికను సీఎం ఆవిష్కరించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకావాలని యూకే ప్రతినిధులను ఆహ్వానించారు.