99TV News

    రక్తదాన శిబిరం: రిషి జూనియర్ కళాశాల సేవ

    రిషి జూనియర్ కళాశాలలో రక్తదాన శిబిరం విజయవంతం

    ​రక్తదానం మహాదానం.. ప్రాణదానంతో సమానం!

    ​

    ​రిషి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా రక్తదాన శిబిరం

    ​స్వచ్ఛందంగా రక్తదానం చేసిన అధ్యాపకులు, సిబ్బంది

    ​విద్యాసంస్థల సామాజిక బాధ్యత అభినందనీయం: రెడ్ క్రాస్ చైర్మన్ కె.ఎస్. రవికుమార్

    ​మహబూబ్‌నగర్, నవంబర్ 27:

    సామాజిక బాధ్యత, మానవతా సేవా దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తిరుమల హిల్స్ (TH) రిషి జూనియర్ కళాశాల గర్ల్స్ క్యాంపస్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (మహబూబ్‌నగర్ జిల్లా శాఖ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని రిషి విద్యాసంస్థల వ్యవస్థాపకులు, డైరెక్టర్ వెంకటయ్య ప్రారంభించారు.

    ​విద్యాసంస్థల చొరవ ప్రశంసనీయం

    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కె.ఎస్. రవికుమార్ మాట్లాడుతూ.. రిషి విద్యాసంస్థల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. కేవలం చదువులకే పరిమితం కాకుండా, సమాజ సేవ పట్ల విద్యాసంస్థలు చూపిస్తున్న చొరవ, బాధ్యతాయుతమైన దృక్పథం ఇతరులకు ఆదర్శమని కొనియాడుతూ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

    ​ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

    రిషి విద్యాసంస్థల వ్యవస్థాపకులు వెంకటయ్య మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ జిల్లా శాఖ తమ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించి, తమను ఈ మహత్తర సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడే రక్తదానం వంటి మానవతా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

    ​తరలివచ్చిన అతిథులు, రక్తదాతలు

    ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్యాముల్, జిల్లా కార్యదర్శి రమణయ్య, ఎంసీ సభ్యులు ధర్మరాజు, జయరాములు, రిషి విద్యాసంస్థల చైర్‌పర్సన్ చంద్రకళ వెంకట్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీరాజ్, డీన్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. న్యూ రిషి పాఠశాల డైరెక్టర్ పూజిత, ప్రిన్సిపల్ రవీందర్‌లతో పాటు న్యూ రిషి, మౌంట్ బాసిల్ పాఠశాలల ఉపాధ్యాయులు, రిషి జూనియర్ కళాశాల అధ్యాపక బృందం, బోధనేతర సిబ్బంది పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రక్తదానం చేసి శిబిరాన్ని విజయవంతం చేశారు.