రియల్ ఎస్టేట్ మెర్సీ కిల్లింగ్ ఆస్తులున్నాయ్.. అమ్ముకునే హక్కు లేదు కోట్ల విలువైన భూములు.. కదలని రిజిస్ట్రేషన్లు
22ఏతో రియల్ మార్కెట్‌కు చివరి ఊపిరి?
కొనేవారు భయంతో వెనక్కి.. అమ్మేవారు నిస్సహాయంగా. యూఎల్సీ పేరుతో మరో ఉచ్చు.. అప్పుల ఊబిలో రియల్టర్లు.
ఒకప్పుడు హైదరాబాద్‌లో భూమి అంటే భరోసా. ఇప్పుడు అదే భూమి యజమానికి భారంగా మారిందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. కోట్ల విలువైన ఆస్తి చేతిలో ఉంది. పత్రాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ జరిగింది. పన్నులు కట్టారు. ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి. అయినా అమ్ముదామంటే రిజిస్ట్రేషన్ కాదు. బ్యాంకు రుణం కావాలంటే సమస్య. కొనేవాడు ముందుకొస్తే వెనక్కి తగ్గుతున్నాడు. కారణం ఒక్కటే.. 22ఏ!
ఇప్పటికే మందగించిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు 22ఏ నిషేధిత జాబితా మరో దెబ్బగా మారిందని రియల్ ఎస్టేట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇది కేవలం రిజిస్ట్రేషన్ సమస్య కాదంటున్నారు. ఆస్తి విలువను ‘కాగితాల మీద’ ఉంచి.. దాని ఆర్థిక ప్రయోజనాన్ని మాత్రం స్తంభింపజేసే పరిస్థితి అని బాధితులు వాపోతున్నారు.
భూమి ఉంది.. డబ్బు లేదు
అదీ ఇప్పటి పరిస్థితి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా నడుస్తుంది? ఒక వ్యక్తి భూమి కొంటాడు. డెవలపర్ దాన్ని అభివృద్ధి చేస్తాడు. కొనుగోలుదారుడు ప్లాట్ కొంటాడు. బ్యాంకు రుణం ఇస్తుంది. రిజిస్ట్రేషన్ జరుగుతుంది. డబ్బు చేతులు మారుతుంది.
అంటే భూమి నుంచి డబ్బు.. డబ్బు నుంచి వ్యాపారం.. వ్యాపారం నుంచి ఉపాధి.. ప్రభుత్వానికి ఆదాయం. ఇలా సైకిల్ తిరుగుతుంది. 22ఏ వివాదం వచ్చి ఈ గొలుసులో ఒక చోట తాళం పడితే? మొత్తం చక్రం ఆగిపోతుంది. అదే ఇప్పుడు హైదరాబాద్ రియల్టీలో జరుగుతోందని రంగం వర్గాలు చెబుతున్నాయి.
‘ఆస్తి నాదే’.. కానీ అమ్ముకోలేను
ఇది సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఒక వ్యక్తి జీవితాంతం సంపాదించిన డబ్బుతో ఇల్లు కొన్నాడు. ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ చెల్లించాడు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఏళ్ల తరబడి పన్నులు కట్టాడు. ఇప్పుడు పిల్లల పెళ్లి కోసం లేదా అప్పు తీర్చేందుకు ఆ ఇల్లు అమ్మాలనుకున్నాడు.
కొనేవాడు వచ్చాడు. డబ్బు కూడా సిద్ధం. కానీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకే సమాధానం.. “22ఏలో ఉంది.. రిజిస్ట్రేషన్ చేయలేం.”
అక్కడే ఆస్తి యజమాని జీవితంలో మరో అధ్యాయం మొదలవుతోంది. రెవెన్యూ కార్యాలయం.. తహసీల్దార్.. కలెక్టర్.. ఎన్వోసీ.. మళ్లీ సబ్ రిజిస్ట్రార్.. ఆస్తి మాత్రం ఇంట్లోనే ఉంది.. యజమాని మాత్రం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు.
అమీన్‌పూర్‌కు చెందిన శ్రీనివాస్ అనుభవం ఈ సమస్య తీవ్రతను చూపుతోంది. జీవితాంతం కూడబెట్టిన రూ.20 లక్షలు.. బ్యాంకు నుంచి తెచ్చిన మరో రూ.40 లక్షలు.. మొత్తం రూ.60 లక్షలతో 180 గజాల ఇల్లు కొనుగోలు చేశారు. కొనుగోలు సమయంలో ఆ ఆస్తి 22ఏలో లేదని సేల్‌డీడ్‌లో స్పష్టంగా ఉందని ఆయన చెబుతున్నారు.
ఇప్పుడు అదే ఇల్లు అమ్ముదామంటే 22ఏలో ఉందని రిజిస్ట్రేషన్ చేయడం లేదు. కొనుగోలుదారుడు కూడా వెనక్కి తగ్గాడు. బ్యాంకు రుణానికి వడ్డీ మాత్రం కొనసాగుతోంది. ఆయన ప్రశ్న సూటిగా ఉంది. “ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఇచ్చింది. ఇప్పుడు అదే డాక్యుమెంట్‌కు విలువ లేకపోతే.. మధ్యతరగతి మనిషి ఏం చేయాలి?” ఇదే 22ఏ వివాదంలో అసలు విషాదం.
అమీన్‌పూర్‌కు చెందిన రాజేశ్‌కుమార్ అనుభవం మరో ప్రమాదాన్ని చూపుతోంది. 2017లో కొనుగోలు చేసిన ఇంటిని తరువాత విక్రయించారు. కొనుగోలుదారుడి రుణ ప్రక్రియ కూడా ముందుకు వెళ్లింది. కానీ రిజిస్ట్రేషన్ సమయంలో ఆ ఆస్తి 22ఏలో ఉందని అధికారులు చెప్పడంతో ప్రక్రియ నిలిచిపోయిందని ఆయన చెబుతున్నారు.
ఇప్పుడు పరిస్థితి ఏమిటి? అమ్మిన వ్యక్తి డీల్ పూర్తయిందనుకున్నాడు. కొన్న వ్యక్తి ఈఎంఐ కడుతున్నాడు. కానీ ఆస్తి మాత్రం అతని పేరుపై లేదు. ఇలాంటి లావాదేవీలు పెరిగితే అది రేపటి న్యాయ వివాదాలకు విత్తనాలుగా మారే ప్రమాదం ఉందని రంగం వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
యూఎల్సీ పేరుతో మరో ఉచ్చు
22ఏతో పాటు యూఎల్సీ సమస్య కూడా రియల్టీని మరింత ఇరుకున పెడుతోందని బాధితులు చెబుతున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన వ్యవహారాలు.. అప్పటి ప్రభుత్వ అనుమతులు.. అప్పటి చెల్లింపులు.. అప్పటి రికార్డులు.. ఇవన్నీ ఇప్పుడు తిరిగి తెరపైకి వస్తున్నాయి.
ఆ కాలంలో ప్రభుత్వం ఫీజులు తీసుకుని అనుమతులు ఇచ్చిందని బాధితులు చెబుతున్నారు. ఇప్పుడు మాత్రం అదే భూములు యూఎల్సీ పరిధిలో ఉన్నాయని పేర్కొంటూ లావాదేవీలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. అక్కడే మరో ప్రశ్న.. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న లోపానికి.. దశాబ్దాల క్రితం ఆస్తి కొనుగోలు చేసిన వ్యక్తి ఎందుకు మూల్యం చెల్లించాలి?
ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం మందగమనాన్ని ఎదుర్కొంటోందని వ్యాపారులు చెబుతున్నారు. హైడ్రా చర్యల తర్వాత కొనుగోలుదారుల్లో భయం పెరిగిందని వారి వాదన. “చెరువు దగ్గర ఉందా? ఎఫ్టీఎల్లో ఉందా? బఫర్ జోన్లో ఉందా? రేపు కూల్చేస్తారా?” అన్న అనుమానాలతో కొందరు కొనుగోలుకు వెనుకాడుతున్నారని రియల్టర్లు చెబుతున్నారు.
ఇప్పుడు 22ఏ మరో ప్రశ్నను తెచ్చింది.. కొన్నా.. రేపు రిజిస్ట్రేషన్ అవుతుందా? అంటే కొనేవాడికి భయం. అమ్మేవాడికి ఆంక్ష. డెవలపర్‌కు అప్పు. మార్కెట్‌కు లావాదేవీ లేదు. ఇదే రియల్ ఎస్టేట్ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
అప్పుల ఊబిలో రియల్టర్లు
ఒక డెవలపర్ భూమి తీసుకుని వెంచర్ వేస్తాడు. అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతాడు. ఫీజులు చెల్లిస్తాడు. లేఅవుట్ అనుమతులు తీసుకుంటాడు. రోడ్లు వేస్తాడు. డ్రైనేజీ ఏర్పాటు చేస్తాడు. బ్యాంకు రుణాలు తీసుకుంటాడు. ఆ తర్వాత ప్లాట్లు అమ్ముతాడు.
కానీ ఆ ప్లాట్లు అమ్మే దశలో.. “22ఏలో ఉంది” అంటే? పెట్టుబడి మొత్తం అక్కడే ఇరుక్కుపోతుంది. వడ్డీ మాత్రం పెరుగుతుంది.
శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఒక డెవలపర్ చెప్పినట్టు.. ప్లాట్లు అమ్మకపోతే వ్యాపార రుణాలు తీర్చడం కష్టమవుతుంది. ఇప్పటికే కొనుగోలు చేసిన వారు డబ్బులు వెనక్కి అడుగుతున్నారు. రియల్టర్ ఇప్పుడు భూమి మధ్యలో కాదు.. అప్పు, వడ్డీ, కొనుగోలుదారుల ఒత్తిడి మధ్యలో చిక్కుకున్నాడు.
ప్రభుత్వ హామీ.. సమస్యకు పరిష్కారం ఎప్పుడు?
నిషేధిత భూముల జాబితా రూపొందించడంలో తప్పు జరిగిందని అంగీకరించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆ తప్పును అధికారుల ఖాతాలో వేశారు. అధికారుల తప్పిదం కారణంగా ఈ సమస్య ఏర్పడిందని చెప్పుకొచ్చారు. గత జీవోలు, ఉత్తర్వులను పట్టించుకోకుండా నిషేధిత జాబితాను రూపొందించారని, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు.
ప్రైవేట్ భూములు సైతం నిషేధిత జాబితాలో చేరాయని పేర్కొన్నారు. తప్పును సవరించి వాటికి సంబంధించిన ఉత్తర్వులను అప్లోడ్ చేస్తున్నామని చెప్పారు. ఈ మాట చెప్పి రోజులు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు. బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
ఈ జీవోలు, మెమోలు అప్లోడ్ చేయని కారణంగా 35-38 వేల పార్సిల్స్ నిషేధిత జాబితాలోకి వచ్చాయి. 22ఏ బాధితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రజలు కష్టపడి సంపాదించుకున్న భూములు, ఇళ్లు, వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఈ జాబితాలో ఉంటే తొలగిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఎవరైనా కొనుగోలు చేసిన భూమి ఏదైనా కారణం వల్ల 22ఏలో పడిపోయినా, ఆ భూమి ఎక్కడికీ పోదని, అధికారులతో మాట్లాడి రిజిస్ట్రేషన్లు అయ్యేలా చూస్తానని భరోసా ఇచ్చారు.
ఇప్పుడు అసలు పరీక్ష
ప్రభుత్వ భూములను కాపాడాల్సిందే. చట్టపరంగా నిషేధిత భూములను రిజిస్ట్రేషన్ నుంచి నిరోధించాల్సిందే. కానీ అదే సమయంలో చట్టబద్ధంగా కొనుగోలు చేసి, దశాబ్దాలుగా అనుభవిస్తున్న ప్రైవేట్ ఆస్తులను కూడా రక్షించాల్సిందే. ఈ రెండింటి మధ్య సమతుల్యతే ఇప్పుడు అసలు పరీక్ష.
ఒక తప్పు సర్వే నంబర్.. ఒక తప్పు ఎంట్రీ.. ఒక పాత రికార్డు.. ఒక సమగ్ర నిషేధం.. ఒక కుటుంబం జీవిత పొదుపును ప్రమాదంలోకి నెట్టవచ్చు.
హైదరాబాద్ రియల్టీకి ఇప్పుడు కొత్త భూమి అవసరం లేదు. ముందుగా ఉన్న భూములపై భరోసా కావాలి. కొనేవాడికి భరోసా కావాలి. అమ్మేవాడికి రిజిస్ట్రేషన్ హక్కు కావాలి. బిల్డర్‌కు స్పష్టమైన టైటిల్ కావాలి. బ్యాంకుకు భద్రత కావాలి. ప్రభుత్వానికి ఆదాయం కావాలి. ప్రజలకు తమ ఆస్తిపై నమ్మకం కావాలి.
ఇవన్నీ ఉన్నప్పుడే రియల్ ఎస్టేట్ బతుకుతుంది. అందుకే బాధితులందరూ కలిసి ఒకే ప్రశ్న వేస్తున్నారు.
ప్రభుత్వ భూములను కాపాడే పేరుతో చట్టబద్ధమైన ప్రైవేట్ ఆస్తుల లావాదేవీలను కూడా శాశ్వతంగా స్తంభింపజేస్తారా?
లేక తప్పులు ఎక్కడ జరిగాయో గుర్తించి.. చట్టబద్ధమైన ఆస్తులకు వెంటనే ఊపిరి పోస్తారా?
రియల్టీ ఇప్పుడు కోరుకుంటున్నది రాయితీ కాదు.. బతికే అవకాశం.
