స్నేహ ఫామ్స్‌పై ఐటీ రైడ్స్; తెలుగు రాష్ట్రాల్లో 16 చోట్ల సోదాలు
హైదరాబాద్, విజయవాడ కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో రికార్డులు, బ్యాంక్ ఖాతాల వివరాలు పరిశీలిస్తున్న అధికారులు
ప్రముఖ పౌల్ట్రీ, అగ్రి బిజినెస్ సంస్థ స్నేహ గ్రూప్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు శనివారం ఉదయం ఏకకాలంలో సోదాలు చేపట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 16 ప్రాంతాల్లో కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
కొండాపూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్, విజయవాడలోని కీలక స్థావరాల్లో ఐటీ బృందాలు రికార్డులను పరిశీలిస్తున్నాయి. సంస్థ డైరెక్టర్లు రామ్‌రెడ్డి డెండి, వరుణ్ రెడ్డి డెండి, స్నేహ డెండిల నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పన్ను చెల్లింపులు, లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ రికార్డులపై అధికారులు దృష్టి పెట్టినట్లు సమాచారం.
HIGHLIGHTS
- తెలుగు రాష్ట్రాల్లో 16 చోట్ల ఐటీ సోదాలు
- హైదరాబాద్, విజయవాడలో తనిఖీలు కొనసాగింపు
- రామ్‌రెడ్డి, వరుణ్ రెడ్డి, స్నేహ డెండి ఇళ్లలో సోదాలు
- 1982లో రామ్‌రెడ్డి చికెన్ మార్కెట్‌గా ప్రారంభం
- 2,000 మందికి పైగా కాంట్రాక్ట్ రైతులతో భాగస్వామ్యం
స్నేహ గ్రూప్ 1982లో రామ్‌రెడ్డి చికెన్ మార్కెట్‌గా ప్రారంభమై, 1994 నాటికి స్నేహ ఫామ్స్‌గా విస్తరించింది. ప్రస్తుతం పౌల్ట్రీ బ్రీడింగ్, చికెన్ ప్రాసెసింగ్, పశువుల దాణా, సఫల బ్రాండ్‌తో వంట నూనెల తయారీ విభాగాల్లో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో గంటకు సుమారు 12,000 కోళ్లను ప్రాసెస్ చేసే ఆటోమేటెడ్ ప్లాంట్‌ను సంస్థ నడుపుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 2,000 మందికి పైగా కాంట్రాక్ట్ రైతులతో సంస్థకు వ్యాపార అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో లావాదేవీల పరిమాణం, సరఫరా ఒప్పందాలు, ఆదాయ వివరాలను ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సోదాలు పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్న పత్రాలు, డిజిటల్ డేటాపై శాఖ తదుపరి చర్యలు నిర్ణయించనుంది.
