కల్వకుర్తిలో సుంకిరెడ్డి స్కిల్ ఫ్యాక్టరీ ప్రారంభానికి ఏర్పాట్లు
డిసెంబర్ 01 నుంచి ఉచిత ఆధునిక టెక్నాలజీ కోర్సులు; గ్రామీణ యువతకు ఉద్యోగ నైపుణ్యాలపై ఐక్యత ఫౌండేషన్ దృష్టి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఆధునిక టెక్నాలజీ, ఉద్యోగ నైపుణ్యాల్లో ఉచిత శిక్షణ అందించేందుకు డిసెంబర్ 01 నుంచి సుంకిరెడ్డి స్కిల్ ఫ్యాక్టరీ ప్రారంభించనున్నట్లు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, TASK సి.ఓ.ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మంగళవారం కల్వకుర్తిలో తెలిపారు.
కల్వకుర్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, MRO కార్యాలయం ఎదురుగా ఉన్న ఓల్డ్ కృష్ణవేణి జూనియర్ కాలేజ్ బిల్డింగ్‌లో ఈ కేంద్రం పనిచేయనుందని చెప్పారు. “గ్రామీణ ప్రాంత యువత ఖరీదైన శిక్షణ కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మన ప్రాంతంలోనే ఆధునిక సాంకేతిక విద్యను ఉచితంగా నేర్చుకునే అవకాశం కల్పించాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం” అని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, పైథాన్, జావా ఫుల్ స్టాక్, డిజిటల్ మార్కెటింగ్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, జీఎస్టీ, ట్యాలీ వంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తామని ఆయన వివరించారు.
అభ్యర్థుల నైపుణ్యాలను ముందుగా విశ్లేషించి, తగిన కోర్సుల్లో నమోదు చేస్తామని ఆయన చెప్పారు. సైద్ధాంతిక బోధనతో పాటు కంప్యూటర్ ల్యాబ్‌లో ప్రాక్టికల్ శిక్షణ, రెజ్యూమ్ తయారీ, ఇంటర్వ్యూ ప్రాక్టీస్, ఉద్యోగ అవకాశాలపై మార్గదర్శకత్వం అందిస్తామని తెలిపారు. “ప్రస్తుత ఉద్యోగ మార్కెట్లో కేవలం విద్యార్హతలు ఉంటే సరిపోవు. యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం” అని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు.
Also Read- ఓటర్ లిస్టులో తండ్రి పేరు తొలగింపు.. పసికందుకు బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించిన అధికారులు!
HIGHLIGHTS
- డిసెంబర్ 01 నుంచి కల్వకుర్తిలో శిక్షణ కేంద్రం
- AI, ML, పైథాన్, జావా కోర్సులు ఉచితం
- 2023లో 60 మందికి కోచింగ్, 22 మందికి ఉద్యోగాలు
- 6 మండలాల్లో 300 మందికి పైగా శిక్షణ
- కేంద్రం ఓల్డ్ కృష్ణవేణి జూనియర్ కాలేజ్ బిల్డింగ్‌లో
నిరుద్యోగ యువత కోసం ఐక్యత ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు 2022లో ప్రారంభమైనట్లు సుంకిరెడ్డి తెలిపారు. నియోజకవర్గ పర్యటనల్లో యువత నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు “నిరుద్యోగ వాణి – ఐక్యత భరోసా” కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆమనగల్, కల్వకుర్తి, కడ్తాల్ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించినట్లు ఆయన వివరించారు. 2023 జనవరి 29న ఆమనగల్లో ఉచిత SI, కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి 60 మందికి శిక్షణ ఇచ్చామని, వారిలో 22 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయని చెప్పారు. అదే ఏడాది ఏప్రిల్‌లో యువత నైపుణ్యాల గుర్తింపు కార్యక్రమం, మే 6న జాబ్ మేళా నిర్వహించినట్లు పేర్కొన్నారు.
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక మహిళా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. 2026 ఏప్రిల్‌లో నియోజకవర్గంలోని 6 మండలాల్లో 6 ఉచిత పోటీ పరీక్షల కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి 300 మందికి పైగా శిక్షణ, ఉచిత స్టడీ మెటీరియల్ అందించినట్లు చెప్పారు. కల్వకుర్తిలో రెండవ బ్యాచ్ ద్వారా మరో 80 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. “యువతకు ఉద్యోగం రావాలంటే ముందుగా నైపుణ్యం రావాలి. ఉద్యోగ సమాచారం మాత్రమే కాకుండా, ఉద్యోగం పొందేందుకు అవసరమైన నైపుణ్యాలు కూడా అందించాలి” అని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.
కల్వకుర్తిలో TASK స్కిల్ సెంటర్ ఏర్పాటు ప్రయత్నం కొన్ని అనివార్య కారణాల వల్ల ముందుకు సాగలేదని, యువతకు మరింత ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సొంతంగా స్కిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. “2022లో యువత అభిప్రాయాలు తెలుసుకోవడంతో ప్రారంభమైన మా ప్రయాణం, నేడు సుంకిరెడ్డి స్కిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వరకు చేరుకుంది. మన ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మా ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతాయి” అని ఆయన పేర్కొన్నారు. ప్రారంభం తర్వాత కోర్సుల నమోదు ప్రక్రియ, బ్యాచ్‌ల వారీ శిక్షణ షెడ్యూల్‌ను ఫౌండేషన్ ప్రకటించనుంది. సమావేశంలో ఐక్యత ఫౌండేషన్ సభ్యులు శేఖర్, గణేష్, శ్రీపతి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
