99TV News

    తెలంగాణ తహసీల్దార్‌పై ఏసీబీ కేసు.. భారీగా ఆస్తులు గుర్తింపు

    తెలంగాణ తహసీల్దార్‌పై ఏసీబీ కేసు.. భారీగా ఆస్తులు గుర్తింపు

    తెలంగాణ తహసీల్దార్‌పై ఏసీబీ కొరడా.. రూ.50 కోట్ల ఆస్తులు గుర్తింపు!

    తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ భారీ అసమాన ఆస్తుల కేసును వెలుగులోకి తీసుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న తహసీల్దార్ దేసాని శ్రీనివాస్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారు.

    ఆగస్టు 20న శ్రీనివాస్ రెడ్డి నివాసం, కార్యాలయంతో పాటు ఆయనకు సంబంధించిన మరో ఐదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మొత్తం ఏడు ప్రాంతాల్లో జరిగిన ఈ తనిఖీల్లో భారీగా స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలను గుర్తించారు.

    సోదాల్లో కర్మన్‌ఘాట్‌లో రెండు రెసిడెన్షియల్ ఫ్లాట్లు బయటపడ్డాయి. వీటి అధికారిక విలువ సుమారు రూ.2.63 కోట్లుగా అధికారులు లెక్కించారు. అదే ప్రాంతంలో 233 చదరపు గజాల స్థలంలో నిర్మించిన జీ+3 పెంట్‌హౌస్ కూడా గుర్తించారు. దీని అధికారిక విలువ సుమారు రూ.1.61 కోట్లుగా ఉంది.

    ఇక యాచారం మండలం నల్లవెల్లి గ్రామంలో 10 ఎకరాల 8 గుంటల వ్యవసాయ భూమి, హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో ఎనిమిది ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన వివరాలు కూడా ఏసీబీకి లభించాయి. వీటితో పాటు బాలాపూర్‌లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో భాగస్వామిగా సుమారు రూ.86 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు.

    సోదాల్లో రూ.4 లక్షల నగదు, రూ.8.6 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, 680 గ్రాముల బంగారు ఆభరణాలు కూడా బయటపడ్డాయి. మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఇంట్లోని వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా అధికారులు గుర్తించారు. మొత్తం ఆస్తుల అధికారిక విలువను ఏసీబీ సుమారు రూ.6.87 కోట్లుగా అంచనా వేసింది. అయితే స్థిరాస్తుల మార్కెట్ విలువ మాత్రం రూ.50 కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు తెలిపారు.

    శ్రీనివాస్ రెడ్డిపై గతంలోనూ అసమాన ఆస్తుల కేసు నమోదైనట్లు ఏసీబీ వెల్లడించింది. 2009లో ఆయన మహేశ్వరం తహసీల్దార్ కార్యాలయంలో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో ఈ కేసు నమోదైంది.

    ప్రస్తుతం అదనపు ఆస్తులపై ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గుర్తించిన ఆస్తులు ఎలా సమకూరాయి, వాటికి ఆదాయ వనరులు ఏమిటనే అంశాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. అరెస్టైన శ్రీనివాస్ రెడ్డిని న్యాయస్థానం ముందు హాజరుపరిచి తదుపరి చర్యలు చేపట్టనున్నారు.