తెలంగాణలో ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ ప్రారంభం
పేద కుటుంబాల పెద్దలకు రూ.5 లక్షల జీవిత బీమా; ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది
తెలంగాణలో పేద కుటుంబాల పెద్దలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ శుక్రవారం క్షేత్రస్థాయిలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్దిపేటలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన తర్వాత ప్రభుత్వం మార్గదర్శకాలు అమల్లోకి తెచ్చింది.
ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ఈ పథకంలో లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. కుటుంబ పెద్దగా గుర్తించిన వ్యక్తికి మాత్రమే బీమా వర్తిస్తుంది. కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మంది సంపాదించేవారు ఉంటే, ఎవరి పేరుపై బీమా చేయాలో ఆ కుటుంబమే నిర్ణయించుకోవాలని అధికారులు చెప్పారు.
రేషన్ కార్డు ఆధారంగా ప్రాథమిక అర్హతను గుర్తించి, ఆధార్ కార్డు వివరాలతో నమోదు పూర్తి చేస్తారు. 1967 నవంబర్ 19 నుంచి 2008 నవంబర్ 18 మధ్య జన్మించిన 18 నుంచి 59 ఏళ్ల వయస్కులు అర్హులవుతారు. రాష్ట్రవ్యాప్తంగా 1.15 కోట్ల కుటుంబాలను ఈ పథకం పరిధిలోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
HIGHLIGHTS
- బీమా మొత్తం రూ.5 లక్షలు
- ప్రీమియం పూర్తిగా ప్రభుత్వ భారం
- డిసెంబర్ 18 వరకు నమోదు
- 23 నుంచి క్లస్టర్ క్యాంపులు
నమోదు ప్రక్రియ డిసెంబర్ 18 వరకు కొనసాగుతుంది. ఈ నెల 23 నుంచి 3 లేదా 4 గ్రామ పంచాయతీలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు కార్యాలయాల్లోనూ వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
జిల్లా కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమించారు. ఆధార్, రేషన్ కార్డు, మొబైల్ నంబర్ వివరాలను ప్రత్యేక మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారు. క్యాంపు స్థాయిలో భౌతిక రిజిస్టర్ కూడా నిర్వహించి ప్రక్రియ పారదర్శకంగా సాగించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. తదుపరి దశలో క్లస్టర్ క్యాంపుల నిర్వహణపై జిల్లాల వారీ షెడ్యూల్ ప్రకటించనున్నారు.
Also Read- కొత్తకోటలో 661 మందికి చేయూత పింఛన్ మంజూరు పత్రాలు పంపిణీ
