తెలంగాణలో 4,89,233 మంది కొత్త లబ్ధిదారుల ఖాతాల్లో పింఛను నగదు జమ
అచ్చంపేట సభలో సీఎం రేవంత్‌రెడ్డి పంపిణీ ప్రారంభం; డిసెంబరు నుంచి పాతవారితో పాటే రెగ్యులర్‌గా చెల్లింపులు
అచ్చంపేట, నవంబరు 27 — తెలంగాణలో కొత్తగా ఎంపికైన 4,89,233 మంది పింఛను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసింది. అచ్చంపేటలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పంపిణీని లాంఛనంగా ప్రారంభించగా, అధికారులు రాష్ట్రవ్యాప్తంగా నిధులు బదిలీ చేశారు.
ప్రభుత్వం జమ చేసిన ఈ మొత్తాన్ని నవంబరు నెల పింఛనుగా పరిగణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త లబ్ధిదారులకు డిసెంబరు నుంచి ఇప్పటికే పింఛన్లు పొందుతున్న వారితో పాటే సాధారణ చెల్లింపుల షెడ్యూల్ ప్రకారం నగదు అందనుంది. సభలో కొందరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి స్వయంగా ధ్రువపత్రాలు అందజేశారు. అనంతరం అర్హుల జాబితా ఆధారంగా సంబంధిత ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసినట్లు సెర్ప్ అధికారులు తెలిపారు.
కొత్తగా పింఛన్లు పొందిన వారిలో 70 శాతానికి పైగా వితంతువులు, ఒంటరి మహిళలే ఉన్నారని అధికారులు చెప్పారు. వితంతువులు 2,89,713 మంది, ఒంటరి మహిళలు 53,841 మంది ఈ విడతలో లబ్ధి పొందారు. దివ్యాంగులు 1,00,273 మందికి కూడా పింఛన్లు మంజూరయ్యాయి. కల్లుగీత కార్మికులు 27,437 మంది, చేనేత కార్మికులు 4,450 మంది ఖాతాల్లో సొమ్ము జమైంది.
HIGHLIGHTS
- కొత్త లబ్ధిదారులు 4,89,233 మంది
- వితంతువులు 2,89,713 మంది
- దివ్యాంగులు 1,00,273 మంది
- ఇన్‌స్టంట్ పింఛన్లు 1,23,625 మందికి
వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా ఈ విడతలో లబ్ధి చేకూరింది. ఫైలేరియా బాధితులు 6,375 మంది, ఎయిడ్స్ బాధితులు 2,938 మంది, డయాలసిస్ రోగులు 1,970 మందికి పింఛన్లు అందాయి. ప్రజావాణి ద్వారా దరఖాస్తు చేసుకున్న ఇతర విభాగాలవారు 2,236 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు.
పింఛనుదారులైన దంపతుల్లో ఒకరు మరణించినప్పుడు మరొకరికి ఆలస్యం లేకుండా అందించే ఇన్‌స్టంట్ పింఛన్లు 1,23,625 మందికి వర్తింపజేశామని సెర్ప్ అధికారులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా అందించిన పింఛన్ల సంఖ్య మొత్తం 6,12,858కు చేరిందని వారు పేర్కొన్నారు. డిసెంబరు చెల్లింపుల నుంచి ఈ కొత్త లబ్ధిదారులందరినీ రెగ్యులర్ జాబితాలో చేర్చి పంపిణీ కొనసాగించనున్నారు.
