99TV News

    వైష్ణవి భర్త హరిబాబు హత్య: సంతోష్ సెల్ఫీ వీడియో

    యూట్యూబర్‌ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. కారులో వచ్చిన వైష్ణవి అన్న హరిబాబుపై కత్తులతో దాడి చేసి హతమార్చాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన హరిబాబు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో అసలు నిందితుడు బయటకు వచ్చాడు. సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశాడు. తాను నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోతున్నానని చెప్పాడు. అందరూ నాకు అండగా ఉండి బయటికి వచ్చేలా చూడాలని కోరాడు. ఆ హత్య తానే చేసినట్లు వైష్ణవి సోదరుడు సంతోష్ స్వయంగా ప్రకటించాడు. తన చెల్లి గర్భవతి అని కూడా చూడకుండా అన్యాయంగా పొట్టనబెట్టుకున్నవాడిని తానే అంతం చేశానని చెప్పుకొచ్చాడు. ఈ హత్య తానే చేశానని...తప్పు చేశాననే బాధ తనకు లేదు అని చెప్పుకొచ్చాడు. ఏ ఆడబిడ్డకు కూడా తన చెల్లికి జరిగినటువంటి

    అన్యాయం పునరావృతం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.తన చెల్లి హత్యకు ప్రతీకారంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంతోష్ పేర్కొన్నాడు. తన చెల్లి మరణానికి ఇలా న్యాయం చేశానని చెప్పుకొచ్చాడు. ఈహత్యతో నిజామాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

    అయితే.. ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు హరిబాబు. రాజరాజేంద్ర స్క్వేర్ వద్ద హరిబాబు రోడ్డు పక్కనున్న భోజన శాలలో ఉన్నాడు. అంతలోపు కారులో నుంచి వచ్చిన వైష్ణవి చిన్న అన్న సంతోష్ నేరుగా హరిబాబు వద్దకు వెళ్లాడు. పదునైన ఆయుధంతో అతడిపై దాడి చేశాడు. స్పాట్‌లో హరిబాబు కుప్పకూలాడు, ఆ తర్వాత మృతి చెందాడు.

    వైష్ణవి ప్రాణాలతో ఉన్నప్పుడు యూట్యూబ్ వీడియోల్లో భర్తతో గొడవలు జరిగిన సందర్భంలో కొన్ని వీడియోల్లో ప్రధానంగా ప్రస్తావించింది. నాకు ఏమైనా అయితే ఎవరు ఊరుకున్నా , మా చిన్న అన్న మిమ్మల్ని వదిలిపెట్టడు అంటూ పలు మార్లు వీడియోల్లో చెప్పింది. వైష్ణవి చెప్పిన మాటలను నిజం చేసి చూపించాడు ఆమె చిన్న అన్న సంతోష్. వైష్ణవి తల్లికి ఆరుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వైష్ణవికి ఇద్దరు సొంత అన్నయ్యలతోపాటు చిన్నమ్మలు, పెద్దమ్మల కుమారులు 13 మంది సోదరులున్నారు. ఆ కుటుంబాల్లో వైష్ణవి ఒక్కతే ఆడ పిల్ల కావడంతో వారందరికీ ఆమె అంటే పంచ ప్రాణాలు . ఎంతో గారాబంగా చూసుకునే సోదరి హత్యకు గురికావడం వైష్ణవి సోదరులు తట్టుకోలేకపోయారు. ఆమె హత్య తర్వాత రెండువారాలు సమాధి వద్దకు వెళ్లి అందరూ విలపించడం కలచివేసింది. హంతకుడు హరిబాబును కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు ఆందోళనలు చేశారు. న్యాయం జరగని పక్షంలో తాము చంపేస్తామని ప్రతినబూనడం సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీసింది. అన్నట్లుగానే హరిబాబును అంతం చేసేశారు

    యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ఒక విషయాన్ని ఆలోచించేలా చేస్తున్నాయి. తన చెల్లిని చంపినందుకే హరిబాబును చంపానంటూ వైష్ణవి అన్న సంతోష్ పెట్టిన వీడియో కింద అతడిని తప్పుబట్టడం కంటే , నువ్వు చేసింది న్యాయమే, ఒక అన్నగా చేయాల్సిన పని చేశావు అంటూ మద్దతుగా వస్తున్న కామెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

    వైష్ణవి హత్య జరిగినప్పుడు కూడా ఈ కేసు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. నాలుగు నెలల గర్భిణిగా ఉన్న ఆమె హత్య కేసులో భర్త హరిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. తన చెల్లిని చంపిన వ్యక్తిని వదిలిపెట్టనని సంతోష్ అప్పట్లోనే ఆగ్రహంగా మాట్లాడారు. తర్వాత హరిబాబు బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయన హత్యకు గురికావడం, తానే చంపానని సంతోష్ చెప్పడంతో పాత ఘటన మరోసారి వైరల్ అవుతోంది.

    ఇక్కడ హరిబాబుకు బెయిల్ రావడాన్ని కూడా చాలామంది ప్రస్తావిస్తున్నారు. అయితే బెయిల్ వచ్చిందంటే కేసు ముగిసిపోయినట్టు కాదు. హరిబాబు నిర్దోషి అని కోర్టు తేల్చినట్టు కూడా కాదు. కేసు విచారణ పూర్తయి, సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత కోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటివరకు చట్టంలో ఉన్న అవకాశాల ప్రకారమే బెయిల్ నిర్ణయం ఉంటుంది. కానీ సాధారణ ప్రజలకు ఈ ప్రక్రియ గురించి అంత క్లారిటీగా అర్థం కావడం లేదన్నది మరో అంశం. ఒక నేరంలో అరెస్టయిన వ్యక్తి కొంతకాలానికే బయట కనిపిస్తే న్యాయం జరగలేదనే భావన కొందరిలో ఏర్పడుతోంది. కేసులు ఏళ్ల తరబడి సాగడం, తీర్పులు ఆలస్యం కావడం కూడా ఇలాంటి అభిప్రాయాలకు కారణమవుతున్నాయి. అందుకే సంతోష్ వీడియో కింద ప్రతీకారాన్ని కూడా న్యాయంగా చూస్తూ కామెంట్స్ రావడం సీరియస్ గా గమనించాల్సిన విషయం. ఇక్కడ సంతోష్ చేసిన పని సరైందా, తప్పా అని సోషల్ మీడియా నిర్ణయించడం ఒక అంశమైతే, ఆ స్థాయిలో స్పందన ఎందుకు వస్తోందనేది మరో అంశం. చట్టం తన పని తాను చేస్తుంది. కానీ బాధిత కుటుంబానికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది, హంతకుడికి బెయిల్ ఎందుకు వచ్చింది, కేసు ఎంతకాలం పడుతుంది అనే విషయాల్లో ప్రజలకు సరైన సమాచారం లేకపోతే అనుమానాలు పెరుగుతాయి .

    హరిబాబు హత్యపై ఇప్పుడు మరో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఒక కుటుంబంలో మొదలైన విషాదం మరో ప్రాణం పోయే వరకు వచ్చింది. అదే సమయంలో సంతోష్‌కు మద్దతుగా వస్తున్న రియాక్షన్స్ మాత్రం న్యాయ ప్రక్రియపై ప్రజలకు మరింత స్పష్టత అవసరమనే అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చాయి.