హైదరాబాద్:
ఆధునిక జీవనశైలిలో ఇయర్ ఫోన్లు వాడకం పెరిగిపోతున్న కొద్దీ, అవి ప్రాణాలను కబళించే మాయా తెరలుగా మారుతున్నాయి. ఇయర్ ఫోన్ పెట్టుకుని నిర్లక్ష్యంగా రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తూ, వెనుక నుంచి వచ్చిన రైలు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లోని బొల్లారం సమీపంలో ఇటీవల చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటన వీడియోను షేర్ చేస్తూ ఐపీఎస్ అధికారి వి.సి. సజ్జనార్ (VC Sajjanar) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేశారు.
జీవితం కంటే ఏ ఫోన్ కాల్ ముఖ్యం కాదు!
"ఆధునికత పేరుతో చెవులకు తగిలించుకుంటున్న ఇయర్ ఫోన్లు వినోదాన్ని పంచుతున్నాయా? లేదంటే కళ్లముందే పొంచి ఉన్న మృత్యు కేకను కూడా వినిపించకుండా ప్రాణాల్ని కబళించే మాయా తెరగా మారుతున్నాయా?" అని సజ్జనార్ ప్రశ్నించారు. "భీకరమైన శబ్దంతో రైలు దూసుకొస్తున్నా, హారన్ మోగుతున్నా గ్రహించలేనంత పరధ్యానంలో మునిగిపోవడం తీవ్ర విషాదాలకు దారితీస్తోంది. సృష్టిలో ప్రాణానికి మించిన అత్యవసరమైన ఫోన్ కాల్ ఏదీ ఉండదు.. అలానే జీవితాన్ని మించిన వినోదమూ లేదు. మాట్లాడుతున్న ఫోన్ కాల్‌ను కాసేపు ఆపవచ్చు, వింటున్న పాటను తర్వాతైనా వినవచ్చు, కానీ ఒక్కసారి ప్రాణం పోతే ఏ శక్తీ తిరిగి తీసుకరా లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు.
వాహనదారులకు తీవ్ర హెచ్చరిక
కేవలం రైల్వే ట్రాక్‌ల వద్దే కాకుండా, రోడ్లపై బైక్‌లు, కార్లు డ్రైవ్ చేస్తూ ఇయర్‌ఫోన్లలో మాట్లాడటం లేదా సంగీతం వినడం వల్ల పరిసరాల పట్ల స్పృహ కోల్పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెనుక నుంచి వచ్చే వాహనాల హారన్లు, అత్యవసర అంబులెన్స్ సైరన్లు వినబడక తమ ప్రాణాలతో పాటు తోటి వాహనదారుల ప్రాణాలనూ ప్రమాదంలోకి నెడుతున్నారని తెలిపారు.
Also Read - గోదావరి జలాలపై రాజకీయ రగడ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు
యువత తక్షణమే మారాలి!
ముఖ్యంగా యువత ఈ భ్రమల నుంచి తక్షణమే బయటకు రావాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. "రోడ్లు, రైల్వే ట్రాక్‌లు అనేవి నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన ప్రదేశాలు తప్ప అలసత్వానికి తావిచ్చే వేదికలు కావు. మీరు ఇంటికి తిరిగి రావడం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూసే మీ కుటుంబాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. కాస్త ఆలోచించండి, బాధ్యతగా మెలగండి" అని ప్రజలకు ఐపీఎస్ సజ్జనార్ హితవు పలికారు.
