శుక్రవారం హైదరాబాద్‌లో వైన్ షాపులు, బార్లు బంద్
గణేశ్ మహా నిమజ్జనం సందర్భంగా 24 గంటల పాటు మద్యం విక్రయాలపై ఆంక్షలు అమలు
గ్రేటర్ హైదరాబాద్‌లో సెప్టెంబర్ 25న జరిగే గణేశ్ మహా నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని వైన్ షాపులు, కల్లు కాంపౌండ్లు, బార్ల మూసివేతకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీస్, ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో ప్రధాన శోభాయాత్రలు, భారీ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా పూర్తయ్యేలా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు కూడా మూసివేయాలని ఆదేశించారు. అయితే స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులలోని బార్లకు మినహాయింపు ఇచ్చారు.
సెప్టెంబర్ 25న తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని సబార్డినేట్ కోర్టులకు సెలవు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెలవుకు బదులుగా డిసెంబర్ 5 శనివారం వర్కింగ్ డేగా ఉంటుంది.
HIGHLIGHTS
- సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి ఆంక్షలు
- సెప్టెంబర్ 26 ఉదయం 6 గంటల వరకు అమలు
- వైన్ షాపులు, కల్లు కాంపౌండ్లు, బార్లు మూసివేత
- స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు మినహాయింపు
నిమజ్జన మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ, భక్తుల రాకపోకలు పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు పర్యవేక్షణను కట్టుదిట్టం చేస్తున్నారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. శోభాయాత్రలు సజావుగా సాగేందుకు ప్రజలు సహకరించాలని సూచించారు.
ప్రధాన నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా పోలీస్ శాఖ, జీహెచ్‌ఎంసీ, ఇతర విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. శుక్రవారం నగరంలోని కీలక ప్రాంతాల్లో భద్రత, ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. తదుపరి సూచనలు అవసరాన్ని బట్టి పోలీస్ అధికారులు విడుదల చేయనున్నారు.
